అదే తప్పు… పదే ..పదే..?

చంద్రబాబు నాయుడు మారతారని ఎవరూ అనుకోరు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సీనియర్ నేత. ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగానూ ఆయనదే రికార్డు. కానీ చంద్రబాబు ఎత్తుగడలు పాత [more]

Update: 2021-07-22 12:30 GMT

చంద్రబాబు నాయుడు మారతారని ఎవరూ అనుకోరు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సీనియర్ నేత. ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగానూ ఆయనదే రికార్డు. కానీ చంద్రబాబు ఎత్తుగడలు పాత చింతకాయ పచ్చడిని తలపిస్తున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వ విషయంలో తలదూర్చి బొప్పికట్టించుకున్నారు. తాజాగా వైసీపీ సర్కారును బద్నాం చేయడానికి అదే తరహా వ్యూహం రచిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది కేవలం రాజకీయ ఆరోపణ కాదు. సాక్షాత్తు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్. చంద్రబాబు నాయుడు ఎంపీ రఘురామ కృష్ణ రాజుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారనేది ప్రభుత్వ ఆరోపణ. అయితే ఇక్కడ సర్కారు కూడా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్పి ఉంటుంది. రఘురామను రాజద్రోహం కింద అరెస్టు చేసేవరకూ చంద్రబాబు కుట్రను కనిపెట్టలేకపోయారా? మరి ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడిపై ఆ కేసు ఎందుకు పెట్టలేదంటే సమాధానం దొరకదు. సొంత ఎంపీపై నమోదు చేసిన కేసును సమర్థించుకునేందుకు ప్రతిపక్ష నేతను వాడుకుంటున్నారనే వాదనా వస్తుంది. మొత్తం వ్యవహారాన్నికొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబుతో రఘురామ జరిపిన మొబైల్ చాటింగ్ ను ఆదారంగా వాడుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఇందులోని న్యాయకోణాలు, చట్టపరమైన సాక్ష్యాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఆ తప్పు చేశారా? లేదా? అన్నది ప్రశ్నగా మిగులుతోంది.

బహిరంగ రహస్యం…

ఎంపీ రఘురామ విషయంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశంపార్టీ బహిరంగంగానే మద్దతునిస్తున్నాయి. తమ అజెండాను సదరు ఎంపీ అమలు చేయడం పట్ల ప్రతిపక్ష నేత చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వైసీపీ సర్కారుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని తెలుసు. కానీ సాధ్యమైనంత వరకూ పబ్లిక్ లో జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడమే లక్ష్యం. పైపెచ్చు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలకంటే రఘురామ చేస్తున్న ఆరోపణలు , విమర్శలకే మీడియాలో ప్రచారం ఎక్కువగా లభిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా వైసీపీ సర్కారు, జగన్ మోహన్ రెడ్డి ఆ విమర్శల పట్ల కుతకుతలాడిపోతున్నారు. ఆ విషయమే టీడీపీకి ఆనందం కలిగిస్తోంది. ప్రజాబాహుళ్యంలో తాము చేయలేకపోతున్న పనిని రఘురామ చేస్తున్నందుకు మురిసిపోతోంది. ఈ విషయంలో చంద్రబాబు మద్దతు మీడియా సహకారం అందరికీ తెలిసినవే. ఇవి ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్న బహిరంగ రహస్యాలు. దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుతో ఆధారాలు సేకరించాల్సినంత సీక్రెసీ ఏమీ లేదు.

కుట్రకోణం కూపీ…

సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన విచిత్రంగానే కనిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దు అంశంపై కోర్టులో పిటిషన్ వేసేముందు రఘురామరాజు చంద్రబాబు నాయుడిని సంప్రతించారనేది ఆరోపణ. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రగా, ఇదో పెద్దనేరంగా చూపించాలని ప్రభుత్వ సీఐడీ వర్గాలు తాపత్రయపడుతున్నాయి. దానివల్ల పెద్దగా ప్రయోజనం సమకూరదు. కోర్టు కేసు వివరాలను చంద్రబాబు నాయుడితో రఘురామ షేర్ చేసుకున్నారనేది నేరం కాదు. అయితే న్యాయపరంగా కేసు నిలబడక పోయినా , వైసీపీకి మాత్రం కచ్చితంగా ఒక ప్రయోజనం సమకూరుతుంది. ఇటువంటి లోపాయి కారీ వ్యవహారాలు నడపటంలో చంద్రబాబు ఇమేజ్ ను ప్రజాక్షేత్రంలో దెబ్బతీయవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటుకు నోటు కేసులో గతంలోనూ చంద్రబాబు ఇన్ వాల్వ్ మెంట్ రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రతిపక్షంగా పొలిటికల్ ఫైట్ చేయాల్సిన టీడీపీ వెన్నుపోటు దారులను అడ్డుపెట్టుకుని గూడుపుఠాణి చేస్తోందనే అనుమానాలు ప్రజల్లోకి పంపడానికి ఆస్కారం ఏర్పడింది.

సరితూగని సాక్ష్యం..

కోర్టులో తమ కేసు మరీ బలహీనంగా వీగిపోకుండా ప్రమాణ పత్రం దాఖలు చేసింది ప్రభుత్వం. మొబైల్ చాటింగ్ లను కుట్రకు ఆధారంగా చూపించింది. ఇది న్యాయ, చట్టపరమైన ప్రమాణాలకు సరితూగదు. పోనీ కేంద్రం ఏమైనా జోక్యం చేసుకుంటుందా? అంటే చూస్తూ మౌనం వహిస్తుంది. టీడీపీ, వైసీపీలు స్వయంక్రుతాపరాధాలతో భ్రష్టు పట్టిపోవాలనేది బీజేపీ దూర ద్రుష్టి. జగన్, చంద్రబాబు నాయుడు పరస్పర కలహాలతో నాశనమైతే , తమ పార్టీకి ఏపీలో ఎంతోకొంత ఆదరణ లభిస్తుందనే దింపుడు కళ్లెం ఆశతో ఎదురుచూస్తుంది బీజేపీ. అందుకే రఘురామ విషయంలో వైసీపీ ప్రతిష్ఠాత్మక పోరాటం చేస్తున్నప్పటికీ ఆయన పదవిపై వేటు పడకుండా కాపాడుతోంది. జగన్, చంద్రబాబు నాయుడుల విషయంలోనూ కేంద్రం తటస్థ పాత్ర పోషిస్తుంది. ఎవరు చట్టపరంగా ఇరుక్కున్నా కేంద్రం రక్షించదు. తమకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయుడు కేసుల్లో ఇరుక్కుంటే రక్షించేవారు కూడా ఎవరూ లేరు. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దయినా పట్టించుకోదు. గతంలో తెలంగాణ ప్రభుత్వంతో ఓటుకు నోటు వివాదం తలెత్తినప్పుడు బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సర్దుబాటు చేశారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ చంద్రబాబుకు ఉండదు. పక్కా ఆధారాలతో వైసీపీ కేసులు పెడితే తప్పించుకో్వడం సాధ్యం కాదు. ఆధారాలు లేకుండా పిల్లల ఆరోపణల తరహాలో అఫిడవిట్లు వేస్తే లాభమూ ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా తన రాజకీయ అనుభవాన్ని ప్రజాసమస్యలు, క్షేత్ర స్థాయి పోరాటాలపై పెడితే మంచిది. రఘురామ ఉదంతం వంటి చిల్లర వ్యవహారాలకు తన తెలివి తేటలను వినియోగించడం పరువు తక్కువ. ప్రజాబలం లేనివాళ్లే ఇటువంటి అడ్డగోలు లక్ష్యాలను ఎంచుకుంటారనే ముద్ర పడితే తెలుగుదేశం భవితవ్యానికే ప్రమాదం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News