బాబు పట్టిసీమ కట్టకపోయి ఉంటే… ?

చంద్రబాబు తన హయాంలో గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ పట్టిసీమ. దీని కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారని, తమ వారికి దోచబెట్టారని విపక్ష వైసీపీ నాడు ఎంత [more]

Update: 2021-07-19 14:30 GMT

చంద్రబాబు తన హయాంలో గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ పట్టిసీమ. దీని కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారని, తమ వారికి దోచబెట్టారని విపక్ష వైసీపీ నాడు ఎంత యాగీ చేసినా కూడా నేడు అదే కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయినిగా మారుతోంది. పట్టి సీమను కనుక చంద్రబాబు నాడు కట్టకపోయి ఉంటే కచ్చితంగా ఈ రోజున సీమ రైతులతో పాటు వారు కూడా ఆరున్నొక్క రాగం ఆలపించాల్సి ఉండేది. ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని అడ్డగోలుగా తోడేస్తూ కేసీయార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకుని పోతున్నారు. 854 అడుగులకు నీరు చేరితేనే దిగువన ఉన్న రాయలసీమకు నీరు అందేది. ఇపుడు కేసీయార్ సర్కార్ పంతంతో ఆ పరిస్థితి కనిపించడంలేదంటున్నారు.

ముందు చూపుతోనే….

ఇక్కడ చంద్రబాబు గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ముందు చూపుతోనే పట్టిసీమ ఎత్తి పోతల పధకాన్ని తలపెట్టారు అంటున్నారు. దానికి నాడు ఆయన చెప్పిన కారణం కూడా రాయలసీమ వాసులకు కన్వీనియెన్స్ గా ఉంది. సీమ రైతులు మండకుండా ఆయన గోదావరి జలాలు కనుక కృష్ణా డెల్టాకు మళ్ళిస్తే నీళ్లు మొత్తం సీమ రైతాంగం వాడుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే చంద్రబాబుకు తెలుసట. తెలంగాణా ఎగువ రాష్ట్రం, పైగా ఎనిమిది దాకా అక్రమ ప్రాజెక్టులు కడుతోంది. అవి కనుక పూర్తి అయితే చుక్క నీరు దిగువకు రాదని, అందుకే ఆదరాబాదరాగా కృష్ణా డెల్టాకు గోదావరి నీరు మళ్ళించారు అంటున్నారు.

అత్తింటి వారికేనా…?

ఇదే ఇపుడు చంద్రబాబు మీద విమర్శల జడివాన కురిసేందుకు కారణం అవుతోంది. రాయలసీమ రైతులు ఇపుడు నీటి కోసం కటకటలాడుతూంటే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తెలంగాణా మీద పల్లెత్తు మాట అనడంలేదు, పైగా ఇదంతా జగన్ నిర్వాకం అంటోంది. జగన్ చేతకానితనం వల్లనే కృష్ణా నది నీళ్ళు లేకుండా పోతున్నాయని కూడా ఆడిపోసుకుంటోంది. అయితే ఈ రకమైన వాదనలను సీమ రైతులు నమ్మడంలేదు. నాడు చంద్రబాబు హయాంలో ఎనిమిది అక్రమ ప్రాజెక్టులకు తెలంగాణ నడుం బిగిస్తే కేవలం పట్టిసీమ కోసం చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారు అంటోంది. ఇపుడు చంద్రబాబు అత్తింటి ప్రాంతమైన కోస్తా జిల్లాలు బాగున్నాయని, ఆయన పుట్టిన గడ్డ విలవిలలాడుతున్నా పట్టించుకోవడంలేదు అని విమర్శిస్తున్నారు.

ఇదేం స్ట్రాటజీ ..?

ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని 23 జిల్లాలకు కలిపి ఎన్టీఆర్ పెట్టారు. ఒక దశలో దాన్ని జాతీయ పార్టీగా కూడా చేయాలని అనుకున్నారు. ఇక చంద్రబాబు అయితే తమది జాతీయ పార్టీ అని చెబుతారు. కానీ ఇపుడు చూస్తీ ఏపీలో సైతం సీమను వేరు గా చేసి చూసే విధానాన్ని అవలంబిస్తున్నారు అంటున్నారు. సీమ నాలుగు జిల్లాలూ గత ఎన్నికల్లో టీడీపీని ఓడించాయి కాబట్టి చంద్రబాబు తాను మాట్లాడాల్సిన అవసరం లేదని ఊరుకుంటున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. మరి 2024లో గెలవాలి అంటే సీమ ఓట్లు వద్ద లేక ఈ ఓట్లూ సీట్లూ అన్నీ కూడా వైసీపీకి రాసి ఇచ్చేశారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంత దాకా ఎందుకు సొంత పార్టీ నేతలు కూడా టీడీపీ అధినాయకత్వం తీరుని తప్పుపడుతున్నారు. ఈ టైమ్ లో చంద్రబాబు జోక్యం చేసుకుని రాయల‌ సీమకు అనుకూలంగా మాట్లాడకపోతే రేపటి ఎన్నికల్లో మళ్ళీ గుండు సున్నాయే టీడీపీకి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు కూడా.

Tags:    

Similar News