జగన్ టార్గెట్….కొత్త రూట్ లో వస్తున్న చంద్రబాబు

విశాఖ జిల్లా ఏజెన్సీ అంటేనే అందాలు, ప్రకృతి సోయగాలు కంటే కూడా బాక్సైట్ గనులే గుర్తుకు వస్తున్నాయి. దీనికి రాజకీయ రాద్ధాంతమే ప్రధాన కారణం. బాక్సైట్ తవ్వకాల [more]

Update: 2021-07-31 14:30 GMT

విశాఖ జిల్లా ఏజెన్సీ అంటేనే అందాలు, ప్రకృతి సోయగాలు కంటే కూడా బాక్సైట్ గనులే గుర్తుకు వస్తున్నాయి. దీనికి రాజకీయ రాద్ధాంతమే ప్రధాన కారణం. బాక్సైట్ తవ్వకాల అంశం ఈ రోజుది కాదు. దానికి పాతికేళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం అయిన కొత్తల్లో బాక్సైట్ గనుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎంతో విలువైన ఈ ఖనిజాలను వాడుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టవచ్చునని బాబు భావించారు. కానీ ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా టీడీపీ నాయకులు, మంత్రులు కూడా మావోయిస్టులకు టార్గెట్ కావడంతో దాన్ని విరమించుకున్నారు.

ఆయన హయాంలో…..

ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా మరోసారి బాక్సైట్ చిచ్చు మన్నెంలో రాజుకుంది. నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన రస్ ఆల్ ఖైమా వారి కంపెనీ అన్ రాక్ అల్యూమినియం ప్రాజెక్ట్ ని విశాఖ ఏజెన్సీలో పెన్నా సిమెంట్ తో కలసి ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి బాక్సైట్ గనులు కావాలంటే నాడు తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అయితే తరువాత టీడీపీ ఇతర ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. విభజన ఏపీలో చంద్రబాబు కూడా బాక్సైట్ విషయంలో కొంత ఉత్సుకత చూపినా వెనక్కు తగ్గారు. ఇక జగన్ వంతు వచ్చింది. ఆయన బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేశారని గత రెండేళ్ళుగా ప్రచారం అయితే సాగుతోంది. కానీ జగన్ సర్కార్ దాన్ని ప్రతీ సారి ఖండిస్తోంది.

సీబీఐ వేయాలా…?

ఇక తాజాగా వామపక్ష నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వ పెద్దలు బాక్సైట్ తవ్వకాలకు మరో మారు దారులు వెతుకుతున్నారు అని ఆరోపిస్తున్నారు. దానికి నాందిగా లేటరైట్ మైనింగ్ తవ్వకాలకు ముందుగా అనుమతించారని కూడా ఆరోపించారు. ఇవే రకమైన ఆరోపణలు టీడీపీ నేతలు కూడా చేస్తున్నారు. ఇపుడు ఏకంగా చంద్రబాబు అయితే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ అనధికారికంగా సాగుతోందని ఆరోపించడంతో ఒక్కసారిగా రాజకీయ కాక రగులుతోంది. అంతే కాదు పదిహేను వేల కోట్ల మేర సహజ వనరుల దోపిడీ జరిగిందని, సీబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.

సీరియస్ మ్యాటరే..?

ఇంతకాలం విశాఖలోని లోకల్ గా ఉన్న నేతలే దీని మీద ఆరోపణలు చేయడం వైసీపీ దానికి బదులు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. కానీ ఫస్ట్ టైమ్ చంద్రబాబు బాక్సైట్ బాంబులే పేల్చారు. అక్కడ పెద్ద ఎత్తున దోపిడీ అన్నారు. దాంతో ఏకంగా గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదీయే మీడియా ముఖంగా ఖండించాల్సివచ్చింది. విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు. ఎలాంటి అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వులు కూడా ఇచ్చామని ఆయన స్పష్టం చెశారు. అక్కడ కేవలం ఆరు లీజులు లేటరైట్ మైనింగ్ 2010 నుంచి జరుగుతుంది. 2019లో మరో లీజు ఇచ్చామని, ఇవన్నీ కలిపి అయిదు వేల టన్నుల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఇంత తక్కువ తవ్వకాల అనుమతితో 15 వేల కోట్ల దోపిడీ ఎలా జరుగుతుందో చెప్పాలని ద్వివేదీ అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ సర్కార్ మీద అసలే మావోలు గుర్రు మీద ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దానికి తోడు బాక్సైట్ బాంబులు వేయడం ద్వారా టీడీపీ కొత్త మంటలు పెడుతోంది అంటున్నారు. మరి దీని మీద వైసీపీ గట్టిగా స్పందించకపోతే నమ్ముకున్న గిరిజనానికి కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News