సమర్థులే మీరయితే…?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఐదు నెలలు కావస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు మాత్రం జగన్ అసమర్థుడని చెబుతున్నారు. అసమర్థ పాలన, చేతకానితనం, మొండి [more]

Update: 2019-10-21 11:00 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఐదు నెలలు కావస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు మాత్రం జగన్ అసమర్థుడని చెబుతున్నారు. అసమర్థ పాలన, చేతకానితనం, మొండి వైఖరి వంటి పదాలను తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తుంది. జగన్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, ఆర్థికంగా కూడా వెనకబడి పోయిందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇదే పాలన ఐదేళ్లు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఇక ఎప్పటికీ కోలుకోలేదని కూడా చంద్రబాబు ముక్తాయింపు నిస్తున్నారు.

వైసీపీ అభ్యంతరం……

ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న అసమర్థ అనే పదాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెబుతోంది. గతంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనను గుర్తుకు తెస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సమర్థుడనే ఏపీ ప్రజలు ఆయనకు పట్టం కట్టిన విషయాన్ని గుర్తు చేస్తుంది. అయితే చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఏం ప్రగతి సాధించారని ప్రశ్నిస్తోంది. నిజానికి చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆయన నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారు.

ఐదేళ్లలో బాబు పాలనలో…..

కానీ ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను బూచిగా చూపించి తిరిగి అధికారంలోకి వద్దామని భావించారు. అంతే కాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపర్చలేకపోయారు. సంక్షేమ పథకాల కంటే చంద్రబాబు ఎక్కువగా కాంట్రాక్టు పనులపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఘోరంగా ఓడించారు. కేవలం 23 స్థానాలకే చంద్రబాబును పరిమితం చేశారు.

ఎందుకు ఓడిపోయారు?

అంత సమర్థుడివైతే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారన్న ప్రశ్నలను వైసీపీ లేవనెత్తుతోంది. కేవలం కాంట్రాక్టు పనులను తన అనుచరులకు కట్టబెట్టేందుకే ఏపీ నిధులను చంద్రబాబు వినియోగించారని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. నిజంగా అంత సమర్థత చంద్రబాబుకు ఉంటే ఏపిని రెండు లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు ముంచారని కూడా వైసీపీ నిలదీస్తుంది. మొత్తం మీద ఎవరు సమర్థులో? ఎవరు అసమర్థులో ప్రజలు ఇప్పటికే నిర్ణయించేశారని ఎద్దేవా చేస్తుంది. ఐదు నెలల్లోనే సమర్థత, తప్పుడు నిర్ణయాలంటూ ఎలా నిర్ణయిస్తారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News