ఇంతోటి దానికి ఇంతసేపా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ నానుస్తారన్న సంగతి తెలిసిందే. జిల్లాల పర్యటన చేస్తున్న చంద్రబాబు పార్టీకి ఇన్ ఛార్జుల నియామకంలోనూ వేచి చూసే ధోరణిని [more]

Update: 2019-10-20 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ నానుస్తారన్న సంగతి తెలిసిందే. జిల్లాల పర్యటన చేస్తున్న చంద్రబాబు పార్టీకి ఇన్ ఛార్జుల నియామకంలోనూ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు లేక పార్టీ కార్యక్రమాలను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో క్యాడర్ లో అయోమయం నెలకొని ఉంది. చంద్రబాబు నిర్ణయం కోసమే ఆ నియోజకవర్గాల క్యాడర్ ఎదురు చూపులు చూస్తుంది. కమిటీలతో కాలయాపన చేస్తే అసలుకే మోసం వస్తుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇన్ ఛార్జుల నియామకంలో….

విషయంలోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, పత్తిపాడు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు పార్టీ మారిపోయారు. అక్కడ ఇటీవల ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన తోట త్రిమూర్తులు, వరపుల రాజాలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా సమీక్ష చేసినప్పుడు చంద్రబాబు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను నియమించాలని కమిటీ వేశారు. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలతో కూడిన కమిటీ ఇంతవరకూ ఇన్ ఛార్జులు ఆ నియోజకవర్గాలకు ఎవరనేది తేల్చలేదు.

త్రిమూర్తులు వెళ్లిపోయినా….

తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ రామచంద్రాపురం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ ఛార్జి దొరకలేదు. ఇక్కడ నేతలు కొందరు ఉన్నా ఇన్ ఛార్జి పదవి తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిపోయారు. ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా పరిటాల సునీత కుటుంబానికి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.

కోడెల ఇలాకాలో…..

ఇక గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇన్ ఛార్జిగా ఉన్న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సత్తెన పల్లి నియోజకవర్గానికి కోడెల శివప్రసాద్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు చంద్రబాబు వద్దకు వచ్చి తమ ఇన్ ఛార్జిని మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావును ఇన్ ఛార్జిగా నియమించేందుకు రెడీ అయ్యారు. ఈలోపు కోడెల మరణించడంతో దానిని నిలుపుదల చేశారు. కోడెల కుమారుడు శివరామ్ ప్రసాద్ కు అప్పగించాలా? లేక రంగారావును నియమించాలా? అన్న విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిల నియామకంలోనే చంద్రబాబు ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలుపార్టీలో బహిరంగంగానే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News