వేటేస్తానని వాటేసుకుంటున్నారే

పోలింగ్ కు ఎన్నికల ఫలితాలకు మధ్య గ్యాప్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మాట అన్నారు గుర్తుండే ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు ఈవీఎంలను [more]

Update: 2019-10-17 14:30 GMT

పోలింగ్ కు ఎన్నికల ఫలితాలకు మధ్య గ్యాప్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక మాట అన్నారు గుర్తుండే ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరిగ్ చేశారంటూనే నియోజకవర్గాల సమీక్షలు చేస్తామని చెప్పారు. కొన్ని నియోజకవర్గాలను సమీక్ష కూడా అప్పట్లో చేశారు. టీడీపీకి సహకరించని పార్టీనేతలపై క్రమ శిక్షణ చర్యను తీసుకుంటానని చెప్పారు. అంతేకాదు వారిపేర్లను తనకు పంపాలని పోటీ చేసిన అభ్యర్థులను కూడా కోరారు. దీంతో అనేక నియోజకవర్గాల నుంచి తమకు సహకరించని టీడీపీ నేతల పేర్ల జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పంపారు.

సహకరించని నేతలపై…..

అయితే ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మాత్రం చంద్రబాబు తీరు మారింది. ఫలితాలు వన్ సైడ్ గా రావడంతో గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జిల్లాల పర్యటనల్లో చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇందులో కూడా అనేక మంది ఓటమి పాలయిన నేతలు తమకు ఎన్నికల్లో సహకరించని వారి పేర్లను బహిరంగంగానే చెబుతున్నారు. అయినా చంద్రబాబు ఎటువంటి యాక్షన్ కు దిగడం లేదు. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిపైనా చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

ఉన్నం విషయమే తీసుకుంటే….

ఉదాహరణకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర నాయుడికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో హనుమంతరాయ చౌదరి ఇండిపెండెంట్ గా కూడా బరిలోకి దిగారు. ఆయనను బుజ్జగించి ఎలాగోలో పక్కకు తప్పుకునేలా చేశారు. అయితే ఉన్నం హనుమంతరాయ చౌదరి బహిరంగంగానే కల్యాణ దుర్గంలో తన వర్గం ఓట్లను వైసీపీకి మళ్లించారన్న ఆరోపణలు విన్పించాయి. దీనిపై ఉమామహేశ్వరనాయుడు పార్టీకి ఫిర్యాదు కూడా చేశారు.

రెండు గ్రూపులుగా….

కానీ ఉన్నం హనుమంతరాయ చౌదరిపై చంద్రబాబు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో అక్కడ టీడీపీకి ఇద్దరు ఇన్ ఛార్జులు తయారయ్యారు. ఉన్నం హనుమంతరాయ చౌదరి కూడా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఇద్దరూ టీడీపీ కార్యాలయానికి వస్తుండటం కార్యకర్తలతో సమావేశం అవుతుండటంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇటీవల రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీకి ఓట్లేసిన వారు టీడీపీ కార్యాలయానికి ఎలా వస్తారని ఉమామహేశ్వరనాయుడి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తమను వద్దనడానికి ఆయనెవరంలూ ఉన్నం వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇలా టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారిని సస్పెండ్ చేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News