ఏం తప్పు చేశావో నిజంగా తెలీదా బాబూ?

“నేనే తప్పు చేశానో నాకు తెలియదు. నేను చేసిన తప్పు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అయితే నన్ను క్షమించండి” అని చంద్రబాబు పలుకుతున్న బేల పలుకులు [more]

Update: 2021-01-22 08:00 GMT

“నేనే తప్పు చేశానో నాకు తెలియదు. నేను చేసిన తప్పు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అయితే నన్ను క్షమించండి” అని చంద్రబాబు పలుకుతున్న బేల పలుకులు దేనికి సంకేతం. నిజంగా చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారా? పార్టీ బలోపేతానికే ప్రాధాన్యత ఇచ్చారా? చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆయన సీఎంగా పనిచేశారు. అటువంటిది ఆయనను ప్రజలు ఎందుకు ఓడించారో తెలియకుండా ఉండి ఉంటుందా?

ఐదేళ్లు చేసిందేంటి?

చంద్రబాబు ఐదేళ్లు ఏం చేశారు? వైసీపీని బలహీనం చేయడానికి ప్రయత్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని, ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా ప్రకటించారు. ఒక కొత్త రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించేటప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టాలన్న సంగతిని కూడా చంద్రబాబు మరచిపోయారు. ఏకపక్షంగా రాజధానిని ప్రకటించారు. అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందా? లేదా? అన్నది పక్కన పెడితే రాజధాని ప్రాంతం కొందరికే పరిమితమయిందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ…

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ చంద్రబాబు చేసింది ఏంది. తన అనుయాయులకు ప్రాజెక్టు పనులు అప్టగించి సోమవారం పోలవరం అని బిల్డప్ ఇవ్వడంతప్ప సాధించిందేమిటి? 70 శాతం పనులను పూర్తిచేశామని చెప్పుకున్న చంద్రబాబు వేగంగా పూర్తి చేయడానికి కారణం రాజకీయం కాదా? కోట్లు ఖర్చు చేసి పోలవరం ప్రాంతానికి ప్రజలు తీర్థయాత్రకు ప్రభుత్వ ఖర్చుతో తరలించడం నిజం కాదా? తాను మరోసారి విజయం సాధించాలంటే పోలవరం, రాజధాని పూర్తి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఐదేళ్ల పాటు కాలయాపన చేశారు. అదే ఆయనకు రివర్స్ రిజల్ట్ వచ్చేలా చేశాయి. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం పేరిట వేల కోట్లు దుర్వినియోగం చేయలేదా?

ఇచ్చిన హామీల అమలు ఏదీ?

ఇక రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణాల రద్దును చేయలేదు. విడతల వారీగా చేస్తానంటూ నాటకాలు ఆడింది ఎవరు? డ్వాక్వా రుణాల రద్దు మాట ఏమయింది? ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరిట ఆడపడచుల ఓట్లను కొల్లగట్టడానికి ప్రయత్నించలేదా? ఇక ఆర్భాటంగా సమ్మిట్ లను నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రజలను నమ్మించిందెవరు? చివరకు వచ్చిందెన్ని? ఇవన్నీ చంద్రబాబు కు తెలియంది కాదు. అవే ఆయన ఓటమికి ప్రధాన కారణాలన్నది పసుపు జెండా కప్పుకున్న ప్రతి కార్యకర్తకూ తెలియదు. కానీ చంద్రబాబుకు తెలియదట. ఈ బేల పలుకులన్నీ సానుభూతి కోసమేనా?

Tags:    

Similar News