పాపం బాబు.. ప్రేక్షకుడు అయిపోయాడే…?

చంద్రబాబు..రాజకీయ తెర మీద హీరోగా వెలిగిపోవాలి. కత్తులూ కటార్లు పట్టుకుని చెలరేగిపోవాలి. అంతే కానీ ఆడియన్స్ కూర్చునే సీట్లో చతికిలపడి నోరెళ్ళబెట్టుకుని మరొకరి సినిమా చూడడమేంటి. అదే [more]

Update: 2020-10-28 14:30 GMT

చంద్రబాబు..రాజకీయ తెర మీద హీరోగా వెలిగిపోవాలి. కత్తులూ కటార్లు పట్టుకుని చెలరేగిపోవాలి. అంతే కానీ ఆడియన్స్ కూర్చునే సీట్లో చతికిలపడి నోరెళ్ళబెట్టుకుని మరొకరి సినిమా చూడడమేంటి. అదే మరి రాజకీయమంటే. ఇంకా చెప్పాలంటే అదే అచ్చమైన ప్రజాస్వామ్యం కూడా. రాజులను తరాజులుగా చేయగలిగిన మంత్రదండం జనాల వద్దనే ఉంది. అందుకే చంద్రబాబును కేవలం ప్రేక్షకుడిగా చేసేశారు. సాధారణ ప్రేక్షకులకు అయితే రాజకీయ తెర మీద ఎవరు విన్యాసాలు చేసినా విచిత్రంగా ఉంటుందేమో కానీ తానే హీరోగా పొలిటికల్ సినిమా చేసిన చంద్రబాబు లాంటి వారికి వేరే హీరో సినిమా కామన్ ఆడియన్ గా చూడాల్సి రావడం కంటే దారుణం, బాధాకరం మరోటి ఉండబోదు కదా.

తట్టుకోలేకపోతున్నారే ….?

నా చేతికి స్టీరింగ్ ఇవ్వండి బండి ఎలా వేగంగా నడపాలో చూపిస్తాను అంటారు కారు లేని వాడు సాటి మిత్రుడిని. అలా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ఆయన కూడా అదే అంటున్నారు. ఏంటో ఈ జగన్ సీఎంగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడే. అదే నేను అయితేనా ఇలా చేసేవాడినా. ఉరుకులు పరుగులు పెట్టించేవాడిని. నేను సీఎంగా ఉంటేనా ఆ కధే వేరూ అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్స్ తిప్పుకుంటూ తెగ నిట్టూరుస్తున్నారు. కానీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన సంగతిని మాత్రం అసలు గుర్తించలేకపోతున్నారు. భరించలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. వరద సహాయ చర్యలు ఇలాగేనా చేసేది అంటూ బురద రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. అక్కడికీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీ పాలనలో కరవు తప్ప వరదలు ఎపుడు వచ్చాయి బాబూ అని నిగ్గదీశారు. అయినా చంద్రబాబు తగ్గడంలేదు. నేను నా అనుభవం అంటూ పాత కధలు వల్లెవేస్తూనే ఉన్నారు.

ఆ దృశ్యాలు చూడలేరా …?

జగన్ చక్కగా రెండవసారి తిరుమల దేవుడి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఇపుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. ఇలా జగన్ అపర‌ భక్తుడిగా దేవుళ్ల, దేవతల సేవలో తరిస్తూంటే చంద్రబాబు ఆ దృశ్యాలు అసలు చూడలేకపోతున్నారులా ఉంది. గత నెలలో తిరుపతి పేరిట డిక్లరేషన్ అంటూ ఎంత గొడవ చేయాలో అంతా చేశారు, కానీ నో యూజ్. ఇక ఇపుడు ఏం చేయగలరు, అందుకే నాకు దక్కాల్సిన అవకాశాలు కావా అవి అనుకుంటూ తెగ బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

ఇలాగైతే కష్టమే….?

జగన్ చంద్రబాబు పేరుని కూడా బయటకు ఉచ్చరించరు కానీ చంద్రబాబు మాత్రం తెల్లారిలేస్తే జగన్ మీదనే విరుచుకుపడిపోతారు. దాన్ని చూసిన తమ్ముళ్ళు ఇన్ని వేల సార్లు రోజుకు ఆయన పేరు వల్లెవేసి బాబే తెగ ప్రచారం చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అని గట్టిగానే చంద్రబాబు గద్దిస్తున్నారు. కానీ జనాలకు అది అక్కసుగా అనిపిస్తోంది తప్ప అరోపణగా ఏ మాత్రం ఆనడంలేదే. ఎపుడైనా పక్వానికి వచ్చినపుడే పండును కోయగలం, తినగలం, ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్న చంద్రబాబుకు ఈ సంగతి తెలిసి కూడా జగన్ మీద అలా పెద్ద నోటితో పడిపోతూనే ఉన్నారు. అలా ఆయనే మరో వైపు జగన్ కి సింపతీ కూడా పెంచుతున్నారు. మొత్తానికి చంద్రబాబు బాగా ఫస్ట్రేషన్ లో ఉన్నారు. దానికి ఇప్పటికైతే మందు లేదంతే.

Tags:    

Similar News