మా బాబే… అంత భక్తి ఎపుడు వచ్చిందో..?

చంద్రబాబు మామ ఎన్టీయార్. ఆయన సినిమాల్లో దేవుడి పాత్రలు వేసి జనం గుండెల్లో రాముడుగా, కృష్ణుడిగా శాశ్వతంగా గుడి కట్టేసుకున్నారు. ఇక ఎన్టీయార్ కి భక్తి కూడా [more]

Update: 2020-09-23 14:30 GMT

చంద్రబాబు మామ ఎన్టీయార్. ఆయన సినిమాల్లో దేవుడి పాత్రలు వేసి జనం గుండెల్లో రాముడుగా, కృష్ణుడిగా శాశ్వతంగా గుడి కట్టేసుకున్నారు. ఇక ఎన్టీయార్ కి భక్తి కూడా చాలా ఎక్కువ. ఆయన దేవుడి పాత్రలు పోషిస్తే దానికి తగ్గ నియమాలు కూడా పాటించేవారు అని చెబుతారు. ఓ విధంగా ఆయన ఏ స్వామీజీ కూడా చేయలేని విధంగా రామయాణ, మహాభారత గాధలను సినిమాలు తీసి సామాన్యుల్లో ఆధ్యాత్మిక భావాన్ని నిండుగా నింపారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎన్టీయార్ దేవుడి విషయాలలో పలు జాగ్రత్తలు తీసుకుని మరీ పాలన చేసేవారు అంటారు. ఆయన‌ 1983లో సీఎం గా గెలిచాక తిరుపతి దేవుడిని దర్శించుకుని గుండు చేయించుకుని మరీ ప్రమాణానికి హాజరయ్యారు. 1994లో కూడా అదే గుండుతో సీఎంగా అన్న గారి ప్రమాణ చిత్రాలు కనిపిస్తాయి. ఇక తన పాలనలో తిరుమలలో ఉచిత అన్న ప్రసాదాన్ని ఎన్టీయార్ ప్రారంభించి శాశ్వతమైన పేరు పొందారు.

భౌతికవాదిగానే…..

ఇక చంద్రబాబుని భౌతికవాదిగానే జనం అర్ధం చేసుకుంటారు. ఆయన ఒక పట్టాన ఎవరికీ అర్ధం కాకపోయినా వివిధ సందర్భాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును చూసిన మీదటన రాజకీయ మేధావులు ఈ అభిప్రాయానికి వస్తారు. ఇక వాస్తవవాదిగా పేరున్న చంద్రబాబులో భక్తి పాలు ఎంత అన్నదే అప్పుడూ ఇపుడూ ఒక చర్చ. ఆయనకు దేవుడి మీద భక్తి లేదని ఉన్నది ఫక్త్ రాజకీయమేనని వైసీపీ నేతలు అంటారు. వారి విమర్శలు అలా ఉంచినా గోదావరి పుష్కరాల వేళ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరుని ఒక మారు చూస్తే తేడా తెలుస్తుంది. షర్ట్ కూడా విప్పకుండా చంద్రబాబు గోదావరి పుష్కర స్నానం చేసిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగానే నాడు వచ్చాయి. అదే కేసీయార్ సంప్రదాయబధ్ధంగా పంచె కట్టి పైన ఎటువంటి ఆచ్చాదన లేకుండా గోదావరి పుష్కర స్నానం చేయడమే కాదు, అక్కడ పండితులకు పాదాభివందనం కూడా చేశారు.

ఆలోచించాల్సిందే…..

ఇక ఇపుడు వీర హిందువుగా చంద్రబాబు ముందుకొచ్చి జగన్ సర్కార్ మీద మత ముద్ర వేస్తున్నారు. దాంతో వైసీపీ మంత్రులకు మండుకొస్తోంది. కొడాలి నాని లాంటి వారు అయితే చంద్రబాబు తిరుపతి వెళ్ళి ఎపుడైనా గుండు చేయించుకున్నారా అని గట్టిగానే గద్దించారు. నిజంగా ఇది ఆలోచించాల్సిందేగా. ఇక బూటు కాళ్ళతోనే బాబు గోదావరికి పుష్కర హారతి ఇచ్చారని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏ సంప్రదాయాన్ని తాను పాటించరని కూడా ఆయన కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

ఇది భక్తేనా…?

ఇక క్రిష్ణా పుష్కరాల సందర్భంగా అడ్డు వస్తున్నాయని చెప్పి ఏకంగా నలభై గుళ్ళను చంద్రబాబు సర్కార్ కూలగొట్టించింది. దీని మీద అప్పుడు బీజేపీ జనసేన కూడా పెద్దగా మాట్లాడలేదు. మరిచంద్రబాబుకు అంతగా దేవుడిపై భక్తి ఉంటే ఈ పని చేసేవారా అని వైసీపీ మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదుగా. ఇక అర్చకులకు ధూప దీప నైవేద్యాలకు వైఎస్సార్ టైంలో నిధులు మంజూరు చేశారు. ఆయన ఏ మతం అయితేనేమి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతగా చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు. మరి చంద్రబాబు హయాంలో టీటీడీలో ఎన్నో వివాదాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు హిందువు. అదొక్కటి చాలు ఆయన రాజకీయం పండడానికి, జగన్ మీద పడిపోవడానికి అంటున్నారు విశ్లేషకులు. అపుడెపుడో అసెంబ్లీలో నా ఒంట్లో ముప్పయి శాతం కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పుకున్న చంద్రబాబు తన రక్తంలో భక్తి పాళ్ళు నూటికి నూరు శాతం ఉన్నాయని ఇపుడు చెప్పుకుంటున్నారు. భక్తి ఉంటే మంచిదే కానీ మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయమే కూడని పని. మరి ఫార్టీ యియర్స్ సీనియారిటీ కలిగిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియవు అనుకోగలమా. గుళ్ళూ గోపురాల రాజకీయాలు చేసే బీజేపీ వద్దే వద్దు అని ఒకనాడు తాను అన్న మాట బాబు మరచిపోతే తప్పెవరిది.

Tags:    

Similar News