జీర్ణం చేసుకోలేకపోయారా?

చంద్రబాబు విశాఖ టూర్ తమ్ముళ్లలకు భరోసా ఇవ్వలేకపోయింది. అదే సమయంలో మరింత దిగులు గుబులు పెంచేసింది. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, ఆయన కామెంట్స్ చూసిన తమ్ముళ్లు తెలుగుదేశం [more]

Update: 2019-10-15 03:30 GMT

చంద్రబాబు విశాఖ టూర్ తమ్ముళ్లలకు భరోసా ఇవ్వలేకపోయింది. అదే సమయంలో మరింత దిగులు గుబులు పెంచేసింది. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, ఆయన కామెంట్స్ చూసిన తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ నుంచి తగిన ధీమాను పొందలేకపోయారు. పార్టీకి చెందిన లీడర్లు చంద్రబాబు రాకను లైట్ గా తీసుకుంటే సీరియస్ గా తీసుకున్న క్యాడర్ చివరకు తేలికైపోయారు. చంద్రబాబు అధినేతగా తమ్ముళ్ళకు భవిష్యత్తు దారి చూపించాల్సింది పోయి దశ, దిశ లేని విధంగా వ్యవహరించడం క్యాడర్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అదే సమయంలో బాస్ వచ్చాడని సంబరపడిన తమ్ముళ్లకు పోలీస్ కేసులు అదనపు వడ్డనగా మిగిలాయి. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో చంద్రబాబు చెప్పక, తమ్ముళ్ళు చెప్పింది వినక సమీక్షా సమావేశాన్ని మమ అనిపించేశారు.

తప్పులు చెప్పినా….?

ఇక విశాఖ జిల్లాలో పలు అసెంబ్లీ సీట్లలో పార్టీ ఎందుకు ఓడిపోయిందన్నది తమ్ముళ్ళు చెప్పేందుకు ప్రయత్నించినా చంద్రబాబు వినకపోగా తాను అనుకున్నదే క్యాడర్ ని నమ్మమని హుకుం జారీ చేయడంతో అసలు ఎందుకీ సమీక్ష అన్నట్లుగా టీడీపీ సమావేశాలు తయారయ్యాయి. అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ పట్టించుకోలేదు, క్యాడర్ ని గాలికి వదిలేశారు, ఎవరి సొంత బిజినెస్ వారు చూసుకున్నారు. అందువల్లనే పార్టీ ఓడిపోయిందని నిజాయతీగా తమ్ముళ్ళు చెప్తే చంద్రబాబుకు జీర్ణం కాలేదట. ఇక ఇపుడు వేదిక మీద మీ పక్కన కనిపిస్తున్న నాయకులను నమ్ముకోకండి, మాలాంటి ద్వితీయ, తృతీయ శ్రేణులకు అవకాశాలు ఇవ్వండి, పార్టీని మేము గెలిపించుకుంటాం అని చెప్పినా కూడా చంద్రబాబు గట్టి హామీ ఇవ్వలేకపోయారు. ముందు పనిచేయండి అన్నీ నాకు తెలుసంటూ దాటవేసే ధోరణి ప్రదర్శించారు. మరో వైపు అయిదేళ్ల పాటు అన్నీ వదులుకుని పార్టీకి పనిచేసి అప్పులపాలు అయ్యాం, మా సంగతి కాస్తా పట్టించుకోండి సారూ అని తమ ముంగిటికి వచ్చిన పార్టీ పెద్దాయన ముందు గోడు చెప్పినా చంద్రబాబు చూద్దామన్న మాటేకానీ భరోసా ఇవ్వలేకపోయారట.

ఎప్పుడూ ఊకదంపుడేనా?

రెండు రోజుల టీడీపీ సమీక్షా సమావేశంపై అదే పార్టీకి చెందిన కొంతమంది తమ్ముళ్ల వ్యాఖ్యానం ఎలా ఉందంటే మేము టీడీపీ కార్యకర్తలం, మా పార్టీ నేతల గురించి చెబితే వింటాం, కానీ చంద్రబాబు నోటి వెంటా టీడీపీ గురించిన మాటల కంటే వందరెట్లు జగన్, వైసీపీ గురించే వచ్చిందంటున్నారు. జగన్నామస్మరణ తప్ప చంద్రబాబు ఏం చెప్పారో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి అని తమ్ముళ్లే అంటున్నారంటే బాస్ హోదాలో చంద్రబాబు ఇచ్చిన బూస్టింగ్ ఏమీ లేదన్నమాటేగా అని వినిపిస్తోంది. ఇక చంద్రబాబు తమ ఊళ్ళో ఉన్నారని తెలిసినా మొదటి రోజు వేదిక మీద కనిపించిన సీనియర్లు తరువాత మళ్లీ ఆ వైపుగా చూడలేదు, పెద్ద నాయకులు ఇలా హాజరు వేయించుకుని ముఖం చాటేస్తే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన క్యాడర్ గోడు వినకుండా చంద్రబాబు పోరాటాలు చేయండని చెప్పి పోవడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పక్కన ఉన్నారన్న ధీమాతో అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన క్యాడర్ మీద పోలీసు కేసులు పడితే చంద్రబాబు మాత్రం టాటా బై బై అంటూ వచ్చిన విమానంలోనే వెళ్ళిపోయారు. మరి తమ్ముళ్లకు భరోసా ఏదీ. ఇదే ఇపుడు విశాఖ టీడీపీలో వినిపిస్తున్న ప్రశ్న.

Tags:    

Similar News