బాబూ..మరీ ఇలా చిన్న పిల్లాడిలా..?

తెలుగుదేశం పార్టీకి ఆయన అధినేత. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ గత ఎన్నికలు ఆయనను పూర్తిగా మార్చి [more]

Update: 2020-08-03 13:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఆయన అధినేత. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ గత ఎన్నికలు ఆయనను పూర్తిగా మార్చి వేశాయి. చంద్రబాబు చేస్తున్న డిమాండ్లు, సవాళ్లు వింటే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. తాజాగా చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ను విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే తాను రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ఒప్పుకుంటానన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని చెప్పారు.

48 గంటల సమయం….

చంద్రబాబు అంతటితో ఆగలేదు. జగన్ కు 48 గంటల సమయం ఇచ్చారు. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల్లోగా జగన్ నుంచి దీనిపై జగన్ నుంచి రెస్పాన్స్ రాకపోతే మళ్లీ ప్రెస్ మీట్ పెడతానన్నారు. ఇంతకీ చంద్రబాబు ప్రస్తుత రాజకీయాలు తెలిసే మాట్లాడుతున్నారా? జగన్ గురించి పూర్తి అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అనేది ప్రశ్నగానే ఉంది. మూడు రాజధానుల అంశం ఒక ప్రభుత్వ నిర్ణయం. రాజధాని మార్పు అనేది న్యాయ పరంగా పోరాడేందుకు వీలుంది. ప్రజా పోరటాలు చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తేవచ్చు.

ప్రజల్లోకి వెళ్లాలి తప్ప…..

కానీ జగన్ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఈ ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తే 2024 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. కానీ 23 స్థానాలు గత ఎన్నికల్లో దక్కించుకుని ఏకంగా అసెంబ్లీని రద్దు చేయమనడమేంటి? అదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రెఫరెండం కోసమని చెప్పడమేంటి? మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీప ప్రభుత్వం తెచ్చింది. అయినా ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియంది కాదు. కేవలం వైసీపీని ట్రాప్ లోకి లాగే ఒక ప్రయత్నమేనని చెప్పుకోవాలి.

డెడ్ లైన్లు, డిమాండ్లు కలసి వస్తాయా?

జగన్ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. ప్రస్తుతం బలంగా ఉన్నారు. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండేంత బలగం ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్ ఎన్నికలకు ఎందుకు వెళ్తారు? అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తారు? చంద్రబాబుకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికా ఫ్రస్ట్రేషన్ కు లోనై ఆ విధమైన డిమాండ్లు చేస్తున్నారనే అనుకోవాలి. ఈ డెడ్ లైన్లు, డిమాండ్లు విపక్ష నేతగా ప్రస్తుతం బలహీనంగా ఉన్న చంద్రబాబుకు కలసిరావు. ఏడాది తిరక్క ముందే ఎన్నికలు రావు. అది అర్థం చేసుకుంటేనే మేలు.

Tags:    

Similar News