బాబు బ్యాటిల్ టీం రెడీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీతో పాటు ముఖ్యంగా అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో [more]

Update: 2019-10-13 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీతో పాటు ముఖ్యంగా అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందడంతో పార్టీ నేతలు కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనేక మంది నేతలు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్యకర్తలు కూడా డైవర్ట్ అవుతారని భావించిన చంద్రబాబు అనుబంధ సంఘాలతో పాటు పార్టీని కూడా బలోపేతం చేయాలని నిర్ణయించారు.

సంస్థాగత ఎన్నికలతో పాటు….

ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ కమిటీల్లో ఎక్కువమంది యువత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలకు సూచించారు. అంతేకాకుండా పార్టీలో పదవులు 33 శాతం మహిళలు, 33 శాతం యువతకు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాకుండా పార్టీ పదవుల్లో పోటీ పెరిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే బ్యాలట్ పద్ధతిలో పార్టీ ఎన్నికలను నిర్వహించాలని చంద్రబాబు నిశ్చయించారు. దీనివల్ల పోటీ పెరిగి పార్టీ పట్ల చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా పనిచేస్తారని చంద్రబాబు అంచనా.

యువ నేతలతో ఎక్కువగా…..

వైఎస్ జగన్ సర్కార్ ను ఇంకా నాలుగున్నరేళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. అందువల్లనే చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాల పర్యటనల్లో ఈ నాలుగునెలల్లో పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నారు? ఎవరు నాయకత్వం వహించారు? అన్న విషయాలను జిల్లా పర్యటనలలో చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా యువ నేతలతో ఆయన ఎక్కువ సేపు మాట్లాడుతున్నారు. వారికి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లు కష్టపడితే తర్వాత తాను అంతా చూసుకుంటానని చంద్రబాబు యువనేతలను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్ నేతలతో భయపడవద్దని కూడా ఆయన పరోక్షంగా సంకేతాలను తన జిల్లాల పర్యటనలో ఇస్తుండటం విశేషం.

అనుబంధ సంఘాలను కూడా…..

దీంతోపాటుగా పార్టీ అనుబంధ సంఘాలను కూడా పటిష్టం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ఉన్నారు. యాక్టివ్ గా ఉండటంతో ఆయనను మార్చే అవకాశం లేదు. అలాగే టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి విషయంలోనూ చంద్రబాబు పాజిటివ్ గానే ఉన్నారు. ఇక తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ప్రస్తుతం పోతుల సునీత ఉన్నారు. ఆమె యాక్టివ్ గా లేకపోవడతో ఆ స్థానంలో వంగలపూడి అనితను నియమించాలని దాదాపు నిర్ణయించారు. అలాగే బీసీ సెల్ అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మిగిలిన అనుబంధ సంఘాల నియామకాలను కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప క్యాడర్ లో మునుపటి ఉత్సాహం ఉండదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

Tags:    

Similar News