నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారుగా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే. ఆయన వేసిన రాంగ్ స్టెప్ లే చంద్రబాబును జాతీయ రాజకీయాలకు దూరం చేశాయని [more]

Update: 2020-08-03 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే. ఆయన వేసిన రాంగ్ స్టెప్ లే చంద్రబాబును జాతీయ రాజకీయాలకు దూరం చేశాయని చెప్పక తప్పదు. ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పిందనే చెప్పాలి. జయలలిత వంటి నేత సయితం చంద్రబాబు ఇంటికి వచ్చి దేశ రాజకీయాలపై మంతనాలు జరిపేవారు.

జాతీయ రాజకీయాల్లో….

ఇలా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో నాడు చక్రం తిప్పిన మాట వాస్తవమే. దేవగౌడను ప్రధానిని చేయడంలోనూ చంద్రబాబు పాత్ర ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాత్రమే. రాష్ట్ర విభజన జరగడంతో చంద్రబాబు పరపతి కూడా క్రమంగా తగ్గుతోంది. ఇందుకు మరో కారణం ఉంది. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో వేసిన అడుగులతో ఆయనపై నమ్మకం కోల్పోయేలా చేసింది.

బీజేపీతో పొత్తు పెట్టుకుని….

బీజేపీతో మూడు సార్లు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యారు. మోదీ కి వ్యతిరేకంగా ముఠాను కూడగట్టే ప్రయత్నం ఢిల్లీలో పెద్దయెత్తున చేశారు. కోల్ కత్తా, చెన్నై, లక్నోలకు వెళ్లి వివిధ పార్టీల నేతలను కలసి వచ్చారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రంలో ఓటమి పాలు కాగా, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు చంద్రబాబు చూస్తున్నారు. అయితే బీజేపీ చంద్రబాబును దగ్గరకు తీసుకునే అవకాశం లేదు.

కాంగ్రెస్ కూటమికి కూడా….

ఇక కాంగ్రెస్ కూటమికి కూడా చంద్రబాబు దూరమయ్యారనే చెప్పాలి. దాదాపు ఏడాదిన్నర నుంచి ఆయన ఢిల్లీ గడప తొక్కలేదు. కనీసం మిత్రులను పలకరించలేదు. దీంతో కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు సయితం చంద్రబాబును పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆయన నమ్మకమైన నేత కాదని చెప్పేస్తున్నాయి. తాజగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తన తండ్రి ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తే తాము నిర్బంధంలో ఉన్నా పలకరించేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించలేదని ఒమర్ అబ్దుల్లా అనడం గమనార్హం. అంటే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు ఇక చోటు లేనట్లే చెప్పాలి. ఏ కూటమి చంద్రబాబును నమ్మడం లేదన్నది వాస్తవం.

Tags:    

Similar News