పాతికేళ్ల నుంచి ముప్ప తిప్పలు పెడుతుందే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ కిందా మీదా పడుతుంది. నియోజకవర్గాల్లో నేతలు పత్తా లేకుండా పోయారు. ఏ నియోజవర్గం పరిస్థిితి [more]

Update: 2020-08-03 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ కిందా మీదా పడుతుంది. నియోజకవర్గాల్లో నేతలు పత్తా లేకుండా పోయారు. ఏ నియోజవర్గం పరిస్థిితి చూసినా అంతే. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఇక టీడీపీ జెండా ఎగరడం కష్టమే. నిజానికి చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడి నుంచి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారు. అలాంటి చంద్రగిరిలో ఇప్పుడు టీడీపీకి దిక్కూ మొక్కూ లేకుండా పోయిందంటున్నారు.

తొలిసారి అక్కడి నుంచే గెలిచి….

1978లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గానికి మారిపోయారు. 1983, 1986ల్లో టీడీపీ ఆవిర్భావంతో అక్కడ పసుపు జెండా ఎగిరింది. 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీకి చంద్రగిరిలో అదే చివరి ఎన్నిక అని చెప్పాలి.

బాబు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి…..

ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబుకు చంద్రగిరి నియోజకవర్గంలో జెండా ఎగురవేయడం కష్టంగా మారింది. అక్కడ గల్లా కుటుంబం బలంగా ఉండటంతో 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గల్లా అరుణ కుమారి హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో చంద్రబాబు డీలా పడ్డారు. 2009 ఎన్నికల్లో అయితే గల్లా అరుణ కుమారికి పోటీగా టీడీపీ నుంచి రోజాను బరిలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. ఇక 2014 ఎన్నికల్లో గల్లా ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకు వచ్చి పోటీకి దింపినా ఫలితం కన్పించ లేదు.

ఇప్పుడు జెండా పట్టేవారే లేరు….

తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పులివర్తి నానిని బరిలోకి దింపి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇలా చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు. ఇప్పుడు కూడా అక్కడ పరిస్థిితి ఏమాత్రం బాగాలేదు. టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న పులివర్తి నాని పూర్తిగా పార్టీని వదిలేశారనే చెప్పాలి. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చంద్రగిరిలో పార్టీని చక్కదిద్దడం ఇప్పటి నుంచే కాదు రెండున్నర దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.

Tags:    

Similar News