ఆయనపై బాబు ఫోకస్… లిఫ్ట్ ఇవ్వాలని?

విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ మీద అధినేత చంద్రబాబు చూపు పడింది. ఆయన్ని బలమైన బీసీ నేతగా ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు [more]

Update: 2020-08-01 14:30 GMT

విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ మీద అధినేత చంద్రబాబు చూపు పడింది. ఆయన్ని బలమైన బీసీ నేతగా ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు రంగం సిధ్ధం చేస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గణేష్ కుమార్ ఆర్మీలో పనిచేసి వచ్చారు. ఆయన రెండు సార్లు విశాఖ సౌత్ నుంచి గెలిచారు. గత పదేళ్ళుగా టీడీపీని అట్టిపెట్టుకుని ఉన్నారు. విశాఖలో సొంత ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నేతగా పేరు సంపాదించుకున్నారు. ఉత్తరాంధ్రాలో బీసీ నేతలు టీడీపీకి ఇపుడు బాగా తగ్గుతున్నారు. కొంతమంది సీనియర్ సిటిజన్లు అయితే మరికొంతమంది వైసీపీకి టార్గెట్ అవుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు వాసుపల్లి వంటి నేతలకు లిఫ్ట్ ఇస్తున్నారు.

నమ్మకమే ……

వాసుపల్లికి కూడా వైసీపీ గేలం వేసింది. ఆయన్ని గోడ దాటించాలని చూసింది. అయితే ఆయన మాత్రం తాను టీడీపీ వీడనని చెప్పేశారు. అంతే కాదు, విశాఖ సౌత్ లో బలమైన క్యాడర్ తో టీడీపీని ఆయన గట్టిగా నిర్మించారు. వరస విజయాలు అందుకుంటున్నారు. 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు మరో వైపు వైసీపీకి వ్యతిరేకంగా బలమైన వాయిస్ ని ఆయన వినిపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన వాసుపల్లి ఇపుడు శాసనసభలో విశాఖ తరఫున కొత్త గొంతుక అవుతున్నారు. అందుకే చంద్రబాబు ఆయన మీద గట్టి నమ్మకం ఉంచారు.

అచ్చెన్న తరహాలో…..

శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మొదట్లో నెమ్మదిగానే ఉండేవారు. చంద్రబాబు గైడెన్స్ తోనే ఆయన తరువాత రోజుల్లో రెచ్చిపోతూ వచ్చారు. ఆయన దూకుడు వెనక చంద్రబాబు వ్యూహాలు చాలా ఉండేవని అంటారు. దాంతో విపక్షంలో అచ్చెన్న చేసిన పోరాటాలకు ఫలితంగా అయిదేళ్ల పాటు మంత్రిగా చేసి చంద్రబాబు ఆయన హోదా పెంచారు. ఇపుడు అచ్చెన్న ఎసీబీ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. ఇక మీదట ఆయన బెయిల్ మీద వచ్చినా గతంలో ఉన్నంత దూకుడు ఉండదన్న డౌట్లు వస్తున్నాయి. పైగా వైసీపీ టార్గెట్ లో ఉన్నారు. దాంతో ఉత్తరాంధ్రా నుంచి కొత్తగా బీసీ నేతలను తయారుచేసుకోవాలన్న ఆలోచనల‌ మేరకే వాసుపల్లిని చంద్రబాబు ఇపుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు.

రాష్ట్ర స్థాయి నేతగా…..

ఇక బీసీల పార్టీగా ఉన్న టీడీపీలో యాధ్రుచ్చికంగా బీసీ నేతలే అనేక కేసుల్లో చిక్కుకుంటున్నారు. దాంతో కొత్త నేతల అవసరం వచ్చిపడుతోంది. మచిలీపట్నానికి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్య కేసులో ఇరుక్కుంటే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు విశాఖ నుంచి బీసీ నేత హోదాలో వాసుపల్లిని చంద్రబాబు పంపించారు. ఆయన విజ‌యవాడ నడిబొడ్డున మీడియా ద్వారా టీడీపీ బీసీ నినాదం వినిపించారు. బీసీల జోలికి వస్తే వూరుకోమని వైసీపీ సర్కార్ కి గట్టిగా చెప్పారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఆయన్ని బీసీ నేతగా చంద్రబాబు ఫోకస్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో మత్యకార జనాభా కూడా ఎక్కువ. తొమ్మిది జిల్లాలను ఆనుకుని తీరప్రాంతం ఉంది. దాంతో బీసీ నేతగా వాసుపల్లిని ముందుకు తెస్తే ఆయన వెలిగిపోవడం ఖాయమని అనుచరులు అంటున్నారు. వాసుపల్లి కూడా టీడీపీ తరఫున గట్టిగా పోరాడేందుకు ఇపుడు రెడీ అంటున్నారు.

Tags:    

Similar News