జూపూడి తర్వాత ఎవరు?

ఖచ్చితంగా ఉంటారనుకున్న నేతలు టీడీపీని వదిలి వెళ్లిపోతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులో అలజడి రేపుతోంది. వరసగా నేతలు అధికార పార్టీలైన వైసీపీ, బీజేపీల్లోకి క్యూ కడుతుండటంతో చంద్రబాబు [more]

Update: 2019-10-12 06:30 GMT

ఖచ్చితంగా ఉంటారనుకున్న నేతలు టీడీపీని వదిలి వెళ్లిపోతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులో అలజడి రేపుతోంది. వరసగా నేతలు అధికార పార్టీలైన వైసీపీ, బీజేపీల్లోకి క్యూ కడుతుండటంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. వెళ్లిపోయిన నేతలందరూ నాయకత్వ సమస్యను లేవనెత్తడం కూడా చంద్రబాబు అసహనానికి కారణంగా చెప్పాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన నాలుగు నెలలకే ముఖ్యనేతలందరూ పార్టీని వీడటం చంద్రబాబుకు కష్టంగా మారింది.

నాలుగున్నరేళ్ల పాటు….

మరో నాలుగున్నరేళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడాల్సి ఉంటుంది. తాను బయటకు వస్తేనే పార్టీ శ్రేణులు కదులుతున్నాయి. గతంలో పార్టీ ఇచ్చిన పలు కార్యక్రమాలకు క్యాడర్ అంతగా పాల్గొనలేదని చంద్రబాబు గుర్తించారు. ఇందుకు కారణం స్థానిక నేతలే. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీని పూర్తిగా వదిలేయడంతో క్యాడర్ అధైర్యపడి అధికార పార్టీ వైపు వెళుతున్న విషయాన్ని చంద్రబాబు పసిగట్టారు. అందుకే ఆయన వరసగా జిల్లాల పర్యటనలకు శ్రీకారంచుట్టారు.

జూపూడి వీడటంపై….

కానీ జూపూడి ప్రభాకర్ రావు లాంటి నేతలు పార్టీని వీడతారని చంద్రబాబు సయితం ఊహించలేదు. తాను పార్టీలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీనిచేసి నామినేటెడ్ పదవిలో నియమించినా జూపూడి ప్రభాకర్ వెళ్లిపోవడాన్ని చంద్రబాబు సీనియర్ నేతల వద్ద తప్పుపట్టినట్లు తెలిసింది. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగానే జూపూడికి పదవి ఇచ్చానని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు జూపూడి తర్వాత పార్టీని వీడేదెవరన్న దానిపై చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించినట్లు చెబుతున్నారు.

పార్టీని పట్టించుకోక పోవడంపై….

కొన్ని జిల్లాల్లో నేతలు పార్టీని పట్టించుకోవడంపైన కూడా చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు విపక్షంలో రాగానే సైలెంట్ అయితే ఎలా? అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ఎన్నికలు తనకు ఒక గుణపాఠం నేర్పాయని, ఎవరు పార్టీకి కట్టుబడి ఉంటారో? ఎవరు ఉండరో? తెలిసిందని చంద్రబాబు సీనియర్ నేతల వద్ద ఆవేదన చెందినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జూపూడి ప్రభాకర్ రావు తర్వాత పార్టీని వీడేవారు ఎవరన్న దానిపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే ఎవరు పార్టీని వీడి వెళ్లినా బుజ్జగించే ప్రసక్తి లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News