రివర్స్ “కిక్కు” అంటే ఇదేనేమో.. బాబు విష‍యంలో అంతే?

టీడీపీ అధినేత చంద్రబాబు పై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. మద్యనిషేధానికి ఇదే సరైన సమయం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. [more]

Update: 2020-05-05 05:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. మద్యనిషేధానికి ఇదే సరైన సమయం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి, డబుల్ స్టాండర్డ్స్ కు ఇదో ఉదాహరణ అంటూ నెటిజన్లు “ఇదే సరైన సమయం” అంటూ ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు మద్య నిషేధం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుందన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి.

మద్యం దుకాణాలు తెరవడంతో…..

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా మద్యం దుకాణాలను ప్రభుత్వం తెరిచింది. దీంతో నెల రోజుల నుంచి మద్యం కోసం ఆవురావరుమంటున్న మందుబాబులు షాపుల వద్ద క్యూకట్టారు. నిజానికి ఇది ప్రభుత్వ వైఫల్యమే. దుకాణాలు ప్రారంభించే విషయం ముందుగా ప్రభుత్వానికి తెలుసు. మద్యం కోసం ఎగబడతారని కూడా అందరికీ తెలుసు. భౌతిక దూరం పాటిస్తూ టోకెన్లు లేదా పరిమితమైన సంఖ్యలో మద్యం పంపిణీ చేయాలి. ఇంతవరకూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు దిగితే బాగుండేది. కానీ మద్యనిషేధానికి ఇదే సరైన సమయం అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన పాత నిర్ణయాలను గుర్తుకు తెస్తున్నాయి.

ఎన్టీఆర్ పెడితే….?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992లో సంపూర్ణ మద్యనిషేధం విధించారు. అయితే సంపూర్ణ మద్యనిషేధం సమయంలో నకిలీ మద్యంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా పెద్దయెత్తున జరిగింది. లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. దీంతో ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్న చంద్రబాబు మద్యనిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పడు ఈ విషయాన్ని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఒక్క ఏపీలోనే కాదుగా…..

ఇక లాక్ డౌన్ మినహాయింపుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మద్యం షాపులు తెరవలేదు. ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీల్లో కూడా మద్యం దుకాణాలు తెరిచారు. మోదీని కరోనా విషయంలో ప్రశసించే చంద్రబాబు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ ను ప్రారంభించడాన్ని మాత్రం తప్పపట్టలేకపోతున్నారు. కేవలం జగన్ విషయంలో మాత్రం మద్యం దుకాణాలను తెరవడం ఆయనకు అభ్యంతరకరమైందని సోషల్ మీడియాలో చంద్రబాబును దెప్పి పొడుస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు పాత కాలపు అనుభవాలే ఆయన మాటల మీద నమ్మకం లేకుండా చేశాయన్నది వాస్తవం.

Tags:    

Similar News