బాబు భవిష్యత్ ప్రణాళిక ఇదేనట

అదేంటి ఈ పోలిక ఏంటి అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ రేపటి రాజకీయాల్లో జగన్ కి పోటీ లోకేష్ బాబే అన్నది తెలుగుదేశం వీరాభిమానుల భావన. అది [more]

Update: 2020-05-10 12:30 GMT

అదేంటి ఈ పోలిక ఏంటి అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ రేపటి రాజకీయాల్లో జగన్ కి పోటీ లోకేష్ బాబే అన్నది తెలుగుదేశం వీరాభిమానుల భావన. అది నిజమేనని రాజకీయ విశ్లేషకుల కచ్చితమైన అభిప్రాయం కూడా. జగన్ వైఎస్సార్ కుమారుడుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరి చంద్రబాబు వారసుడు కూడా రంగంలో ఉండాలి, వీరంగం చేయాలి. అందుకే కదా బాబు ఆయన్ని మంత్రిని చేసి మరీ అయిదు కీలకమైన శాఖలు అప్పగించింది. ఇంత చేసినా కూడా లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. రేపటి రోజున శాసనమండలి రద్దు అయితే మాజీ మంత్రిగా దేవినేని ఉమామనేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల పక్కన ఆయన కూడా కూర్చోవాల్సిందే.

అదే ఆరాటం ….

ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే తాను అనుకున్న పనిని ఏదో దోవన సాధించేందుకు సిధ్ధపడతారు. రాజకీయాల్లో అన్ని దారులూ ఉండాల్సిందేనన్నది చంద్రబాబు మార్క్ ఫిలాసఫీ. కేవలం బాబుకు మాత్రమే కాదు, రాజకీయం అంటే అదే అర్ధం కూడా అంటారంతా. ఇపుడు జగన్ సీఎం రేపటి రోజున తన కుమారుడు కూడా సీఎం కావాలి. ఇది చంద్రబాబుకు ఉన్న గట్టి పట్టుదల. బాబు అనుకోవాలే కానీ దానికి సంబంధించి తెర వెనక కసరత్తు సాగుతూనే ఉంటుంది. ఇక 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి చంద్రబాబే. ఇందులో రెండవ మాటకు తావు లేదు. అయితే టీడీపీ గెలిస్తే చంద్రబాబు పూర్తి కాలం సీఎంగా ఉంటారా అంటే ఆయన ఆరోగ్యరీత్యా ఉండరనే మాట ఆ పార్టీలో వినిపిస్తోంది. తన కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన అని ఆంతరింగుకులు చెబుతారు. అంటే తెర వెనక మాత్రమే బాబు ఉంటారన్న మాట.

మద్దతు ఉంటుందా?

ఇక తెలుగుదేశం పార్టీ ఎంత నారా వారిదైనా కూడా తమ్ముళ్ల అభిప్రాయం కూడా కావాలి కదా. వారి మద్దతు లేకపోతే సైకిల్ ముందు చక్రం కూడా కదలదు. టీడీపీలో సీనియర్లు కూడా లోకేష్ విషయంలో నిలువునా చీలిపోతున్నారు. అయ్యన్నపాత్రుడు లాంటి అతి తక్కువ మంది మద్దతు మాత్రమే లోకేష్ బాబుకు దక్కుతోంది. ఈ విషయంలో యనమల రామకృష్ణుడు లాంటి వారు మా వరకూ చంద్రబాబే సుప్రీం. ఆయనే మా లీడర్ అంటున్నారు. ఆ తరువాత వారసుడు ఎవరో మాకు తెలియదు. చూద్దామని చెప్పేస్తున్నారు. ఇదే వైఖరిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వంటి వారు కూడా ఉన్నారు.

ఎవరు బెస్ట్…?

అయితే గంటా లాంటి వారు తూకం వేసుకుంటున్నారు. తాము రాజకీయాల్లో ఇకపైన కొనసాగాలంటే జూనియర్ నేతల నాయకత్వంలోనే పనిచేయాలని టీడీపీలోని గంటా లాంటి వారికి అర్ధమవుతోంది. అయితే ఏ నేత బెస్ట్ అన్నది వారికి వారే బేరీజు వేసుకుంటున్నారు. జగన్ పార్టీలో చేరితే ఆయన మాట ప్రకారమే పనిచేయాలి. టీడీపీలో కొనసాగితే పేరుకు బాబు ఉన్నా తెర వెనక లోకేష్ రాజకీయం పనిచేస్తుంది. ముందే చెప్పుకున్నట్లు ఏ రోజు అయినా లోకేష్ సీఎం అభ్యర్ధిగా ముందుకు వస్తారు. అందువల్ల చంద్రబాబుని పూర్తికాలానికి అధినేతగా ఇపుడు సీనియర్ తమ్ముళ్ళు చూడడంలేదు అంటున్నారు. తమకు చంద్రబాబు మాదిరిగానే లోకేష్ వద్ద కూడా గౌరవం, మర్యాద, స్వేచ్చా లభిస్తేనే టీడీపీలోనే ఉండాలనుకునే వారి జాబితా పెరుగుతోంది. ఒకవేళ అలా కాదు అనుకుంటే రాజకీయంగా బాబు తరువాత అనుభవం ఉన్న జగన్ వైపే తమ్ముళ్ళు మొగ్గు చూపడం ఖాయం. మరి లోకేష్ తన తీరుని సరిచేసుకోవడంపైనే సీనియర్లు, కీలక నేతలు పార్టీ గడప దాటకుండా వెళ్ళడం ఆధారపడిఉంటుంది అన్నది సత్యం.

Tags:    

Similar News