చిక్కని బాబు….దొరకని చంద్రుడు

అదేంటో ఈ రెండింటికీ లంకె పెట్టి వినోదించాలని ప్రత్యర్ధి పక్షాలు ఎపుడూ చూస్తూంటాయి. కానీ చంద్రబాబుకు సీబీఐకి చుక్కెదురు అన్న సంగతి అందరికీ తెలుసు. సీబీఐని చంద్రబాబు [more]

Update: 2020-05-09 05:00 GMT

అదేంటో ఈ రెండింటికీ లంకె పెట్టి వినోదించాలని ప్రత్యర్ధి పక్షాలు ఎపుడూ చూస్తూంటాయి. కానీ చంద్రబాబుకు సీబీఐకి చుక్కెదురు అన్న సంగతి అందరికీ తెలుసు. సీబీఐని చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీలోకే రాకుండా ఆర్డర్ వేశారు. ఆయన వరకూ చూస్తే సీబీఐ తో ఎపుడూ పడదు, కానీ ప్రత్యర్ధులకు మాత్రం దాన్ని తగిలించి తమాషా చూడడం చంద్రబాబుకు అలవాటు. ఆయన రాజకీయ జీవితంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సందర్భాలు ఎన్నో సార్లు ఉంటాయి. అవన్నీ ఇతరులూ గురించే. అంటే అవినీతి లేని సమాజం కోసం అన్నమాట. ఆ విధంగా చంద్రబాబు సీబీఐని తనదైన రాజకీయ సాధనంగా వాడుకున్నారన్న ప్రచారమూ ఉంది.

అదే డిమాండ్…..

ఇలా సీబీఐకి చంద్రబాబుకు అసలు పడదు అని తెలిసి కూడా పాచిపోయిన డిమాండ్ ని మళ్ళీ మళ్ళీ చేయడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమాయకుడేమీ కాదు. ఆయన ఆలోచన ఆయనకుంది. అలాగే ఆయన వ్యూహం ఆయనది, అందుకే తాజాగా చంద్రబాబు సీబీఐ విచారణకు సిధ్ధపడాలని గట్టిగా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒక్కరినే అంటే రాజకీయ వేధింపు అనుకుంటారేమోనని తనను కూడా జత చేసుకున్నారు. మన ఇద్దరి ఆస్తులు ఎంతో తేల్చుకుందాం. సీబీఐని లెక్కలు చూడమందామని విజయసాయిరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు నిజాయితీగా బయటపడతారో కూడా తెలుస్తుందని అంటున్నారు.

జగన్ కాదుగా….

జగన్ పదేళ్ళ క్రితం తండ్రిని కోల్పోయి రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ సమయంలో ఆయనకు పెద్దగా రాజకీయ అవగాహన లేకుండానే కాంగ్రెస్ కొండను ఢీ కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఆయన మీద సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించింది. కాగల కార్యం కాంగ్రెస్ తీరుస్తే చంద్రబాబు లాంటి గండరగండడు ఊరుకుంటారా అందుకే తానూ ఒక చేయి వేశారు. మొత్తానికి అప్పట్లో జగన్ పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇపుడు కూడా ఆ కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి. సీబీఐ అంటే ఇపుడు జగన్ కి తెలిసింది. మరి ఎపుడో రాజకీయంగా ముదిరిపోయిన చంద్రబాబు ఆ పామును చుట్టుకుంటారా? జగన్ ని, తననూ జైలు పాలు చేశారన్న అక్కసు విజయసాయిరెడ్డిలో ఉండొచ్చు గాక. కానీ చంద్రబాబు సులువుగా సవాల్ స్వీకరించి ఇరుక్కుంటారా? అది కుదిరేపని కాదు.

తీరని కోరికేనా..?

నాడు వైఎస్సార్, నేడు తనయుడు జగన్ ఇద్దరూ కూడా చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేశారు. కానీ ఫలితం శూన్యం. అయిదుంపావు ఏళ్ళు వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు మీద అనేక విచారణ కమిటీలు వేశారు. కానీ నిరూపించలేకపోయారు. ఇపుడు కొడుకు వంతు, జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లోతైన దర్యాప్తే చేస్తూ వస్తున్నారు. గత పాలనలో జరిగిన తప్పొప్పుల గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఎక్కడా దొరకడంలేదే. ఇంత చేసినా దొరకని బాబు విజయసాయిరెడ్డి సీబీఐ విచారణ అంటే దొరికేస్తారా. సరే రెడీ అంటూ దూకేస్తారా. ఇది వైసీపీకి ఎప్పటికీ తీరని కోరికగా ఉంటుందేమో. లేకపోతే ఏదైనా అద్భుతమే జరగాలేమో.

Tags:    

Similar News