చెడుగుడు ఆడేసుకుంటున్నారా?

రాజకీయాల్లో ఉంటే పదవులు ఎటూ వస్తాయి. వాటితో పాటే బిరుదులూ వస్తాయి. నచ్చిన వారు ఇచ్చే బిరుదులు రంజుగా ఉంటాయని, నచ్చని వారు పెట్టే పేర్లు, ఆడే [more]

Update: 2020-05-03 14:30 GMT

రాజకీయాల్లో ఉంటే పదవులు ఎటూ వస్తాయి. వాటితో పాటే బిరుదులూ వస్తాయి. నచ్చిన వారు ఇచ్చే బిరుదులు రంజుగా ఉంటాయని, నచ్చని వారు పెట్టే పేర్లు, ఆడే ఎకసెక్కాలు కూడా కొత్త కిరీటలు అవుతాయి. అయినా ఇవి భారం అనుకోకుండా రాజకీయం చేసినన్నాళ్ళూ మోయాల్సిందే. ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయనకు పెర్మనెంట్ బిరుదు ఒకటి ఉంది.అదే వెన్నుపోటు వీరుడు. ఆ ప్రస్తావన తేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా చంద్రబాబుని అసలు తిట్టకుండా ఉండదు. చంద్రబాబు వెన్నుపోటుకు పూర్తిగా పేటేంట్ హక్కులు కలిగి ఉన్నారని కూడా ఆయా పార్టీల నాయకులు సెటైర్లు వేస్తారు. ఎపుడో పాతికేళ్ళ క్రితం జరిగిన వెన్నుపోటు చంద్రబాబుకు పుచ్చిపోయిన పన్ను పోటులా ఇప్పటికీ బాధిస్తోంది. అయినా ఆయన వాటిని భరించక తప్పదు.

సెల్ఫ్ క్వారంటైన్ బాబు అట….

ఇపుడు కరోనా మహమ్మారి పుణ్యమాని క్వారంటైన్ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పర భాష పదం ఇది. ఎపుడో పద్నాలుగవ శతాబ్దంలో తొలిసారిగా దీని కనిపెట్టారు. ఇపుడు ఆ పదం చంద్రబాబుకు ఆపాదిస్తూ సెల్ఫ్ క్వారంటైన్ బాబు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఇంట్లో కూర్చుకుని ఊరకే తోచక అక్కసుతో ఆడిపోసుకుంటున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. సరే ప్రతి విమర్శలూ ఎటూ ఉంటాయి కానీ చంద్రబాబు గాలి మొత్తం తీసేలా ఆయన ఖాళీగా ఇంట్లో ఉన్నారని సులువుగా అందరికీ చెప్పేలా క్వారంటైన్ బాబు అన్న బిరుదుని విజయసాయిరెడ్డి ఇచ్చేశారు.

పరదేశి కూడా…..

ఇక మిగిలిన వైసీపీ నేతలు, మంత్రులు కూడా ఏమీ తీసిపోవడంలేదు. చంద్రబాబుబుతో ఓ రకంగా చెడుగుడు ఆడుకుంటున్నారు. చంద్రబాబుని ఏకంగా పరదేశి చేసి పారేశారు. ఏపీతో నీకేం సంబంధం అన్నదాకా వెళ్తున్నారు. అదేంటి సరిగ్గా ఏడాది క్రితం వరకూ ఆయనేగా ఏపీ సీఎం. ఇపుడైనా ఆయనేగా ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయనకు ఏపీతో సంబంధ‌మేంటి అని వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలా ఈజీగా ఎలా అనేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ళు గింజుకోవచ్చు గాక. కానీ అసలు నిజం అనిల్ చెప్పేశాక వారు కూడా నోరుమెదపలేకపోతున్నారు. చంద్రబాబుకు ఏపీలో సొంత ఇల్లు ఉందా. కనీసం గజం జాగా అయిన ఉందా. పోనీ ఏమీ లేదనుకున్నా అద్దెకో, లీజుకో కరకట్ట వద్ద ఉన్న లింగమనేని ఎస్టేట్ ఇంట్లోనైనా చంద్రబాబు ఇపుడు నివాసం ఉంటున్నారా. అదీ లేదే. ఆయన ఎక్కడో వందల కోట్లతో కట్టిన విలాస భవనంలో ఉంటూ ఊసుపోని విమర్శలు చేసే మేం పడాలా అంటూ లాజిక్ పాయింట్ తీస్తున్నారు మంత్రి అనిల్.

గుచ్చేస్తున్నారా….?

చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నూటికి నూరు శాతం తప్పు అన్నవి కూడా లేవు. కానీ ఉప్పూ నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీ బంధం ఎపుడూ యుధ్ధానికే సై అంటుంది. అందువల్ల మొదటికే చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించాలంటే పెద్ద కత్తే పట్టుకోవాలి. వైసీపీ వ్యూహంతో చేస్తున్నది ఇదే. చంద్రబాబు ఆరోపణలు గాలికి కొట్టుకుపోయేలా చేస్తున్నారు. అసలుకే ఎసరు పెడుతున్నారు. ఆపదలో ఏపీ ఉంటే నీవు ఎక్కడ ఉన్నావు బాబూ.. ఎంచక్కా ఇంట్లో ఉంటూ మా మీద రాళ్ళేస్తావా అంటూ వైసీపీ చంద్రబాబుని పొరుగు రాష్ట్రం పెద్ద మనిషిగా చేసి తీసి పారేస్తోంది. దీంతో పసుపు పార్టీ చెప్పుకునేందుకు కూడా ఏమీ లేకుండా ఉంది. మొత్తం మీద చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటూ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వృధా ప్రయాస కావడమే కాదు, మరింత చేటు తెచ్చేలా ఉన్నాయని టీడీపీలోనే వినిపిస్తోందిపుడు.

Tags:    

Similar News