31 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడం అంత ఈజీనా?

ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నేత. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలుపొందారు. అయినా ఆయనను లాక్ డౌన్ సమయంలో అధికార పార్టీ [more]

Update: 2020-04-29 06:30 GMT

ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నేత. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలుపొందారు. అయినా ఆయనను లాక్ డౌన్ సమయంలో అధికార పార్టీ ఇబ్బందులకు గురిచేస్తుంది. కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు కన్పించడం లేదంటూ ఇటీవల కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం వెటకారంగానే కన్పిస్తుంది. ఎవరు అవునన్నా, కాదన్నా కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట.

ఏడుసార్లు వరసగా గెలుపొంది…

చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలుపొందారు. 1989 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయనకు అక్కడ ఓటమి ఎదురు కాలేదు. సొంత నియోజకవర్గం కాకున్నా కుప్పం ప్రజలు చంద్రబాబును మూడు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కుప్పంలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోలేదు.

బాబు కుప్పం నియోజకవర్గానికి…..

చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఎంతో చేశారు. అది కాదనలేని వాస్తవం. ఇజ్రాయిల్ వ్యవసాయం నుంచి అనేక పథకాలను కుప్పం నుంచే చంద్రబాబు ప్రారంభించారు. అయినా ఇంకా నియోజకవర్గంలో కొన్ని సమస్యలున్నాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం ఒక్కటే టీడీపీ గెలుచుకుంది. చంద్రబాబు మెజారిటీ కూడా కొంత తగ్గిన మాట వాస్తవమే. అయినంత మాత్రాన కుప్పం లో గెలుద్దామనుకోవడం వైసీపీ అత్యాశ అవుతుందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలోనూ…..

లాక్ డౌన్ సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు కుప్పం నియోజకవర్గంలో పోలీసులకు చంద్రబాబు పై ఫిర్యాదు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అధికారులతో కూడా ఇటీవల మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగయితే జగన్ పులివెందుల లాక్ డౌన్ సమయంలో వెళ్లారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో టార్గెట్ చేసి ప్రయోజనం ఏమీ లేదని, ఆ శ్రద్ధ ఇతర ప్రాంతాల్లో పెడితే బాగుంటుందని టీడీపీ నేతలు సూచిస్తున్నారు.

Tags:    

Similar News