అంది వచ్చిన అవకాశం.. అందుకే రంగంలోకి దించారా?

కరోనా సమయంలోనూ ఏపీలో రాజకీయాలు ఏమాత్రం ఆగడం లేదు. ఇందుకు ఏ రాజకీయ పక్షమూ మినహాయింపు కాదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మాత్రం కరోనా కట్టడిలో ప్రభుత్వ [more]

Update: 2020-04-27 05:00 GMT

కరోనా సమయంలోనూ ఏపీలో రాజకీయాలు ఏమాత్రం ఆగడం లేదు. ఇందుకు ఏ రాజకీయ పక్షమూ మినహాయింపు కాదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మాత్రం కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ప్రజాదరణను పొందేందుకు ప్రయత్నిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి రోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే నాలుగు జిల్లాల్లో నేతలకు చంద్రబాబు ప్రత్యేకంగా మార్గదర్శకాలు సూచించినట్లు తెలుస్తోంది.

నాలుగు జిల్లాల్లో….

ప్రధానంగా ఏపీలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా నాలుగు జిల్లాల్లో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. దీంతో ఈ నాలుగు జిల్లాల నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి కారణాలను ప్రజల ముందుంచాలని నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ జిల్లాల్లో వ్యాధి ప్రబలిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

టీడీపీ నేతలకు చంద్రబాబు….

కర్నూలు జిల్లాలో ఈ బాధ్యతను మాజీ మంత్రి అఖిలప్రియకు అప్పగించారని చెబుతున్నారు. అందుకే అఖిలప్రియ గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరోజ్ ఖాన్, బియ్యపు మధుసూదన్ రెడ్డిలపై అఖిల ప్రియ ఆరోపణలు అందుకే. వైసీపీ ఎమ్మెల్యేలు అధికారులకు సహకరించకపోవడంతోనే వైరస్ ఈ జిల్లాల్లో వ్యాప్తి చెందిందన్నది కర్నూలు జిల్లా టీడీపీ నేతల ఆరోపణ. కర్నూలు జిల్లాలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వ వైఫల్యాలను….

ఇక గుంటూరు జిల్లాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరుకుంది. దీంతో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నరసరావుపేటలో కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యే కారణమంటూ టీడీపీ ఆరోపించింది. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రలను ఈ పనికి పురమాయించారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డిని రంగంలోకి దిగాలని ఆదేశించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటూ రాలేదు. చిత్తూరులో ఒకటి, గుంటూరులో రెండు మాత్రమే టీడీపీకి వచ్చాయి. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో వచ్చిన అవకాశాన్ని టీడీపీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్కారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News