చంద్రబాబు @ 70 అయినా… యువకుడిగానే?

తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగు దేశం పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకుని ఆయన రాజ‌కీయాల్లో ఎదిగిన వైనం. [more]

Update: 2020-04-20 03:30 GMT

తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగు దేశం పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకుని ఆయన రాజ‌కీయాల్లో ఎదిగిన వైనం. విజ‌న్ ఉన్న నాయకుడిగా ఆయ‌న ప్రస్థానం వంటివాటిని ప‌రిశీలిస్తే.. అనేక ఎత్తుపల్లాలు కన్పిస్తాయి. అన్నింటినీ త‌న‌లో క‌లుపుకొనే ల‌క్షణం ఉన్న నాయ‌కుడుగా చంద్రబాబు త‌న‌దైన శైలిని విభిన్నంగా ఆవిష్కరించారు. త‌న‌కు వ్యతిరేక ప‌రిస్థితులు ఎదురైనా.. ఆయ‌న వాటిని త‌ట్టుకుని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

ఐఏఎస్ కావాలని…

విద్యార్ధి ద‌శ నుంచే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన చంద్రబాబు.. వాస్తవ ల‌క్ష్యం ఐఏఎస్‌. అయితే, ఆ త‌ర్వాత ప‌రిణామాలు ఆయ‌న‌ను రాజ‌కీయాల దిశ‌గా న‌డిపించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చేరువైన ఆయ‌న తర్వాత క్రమంలో అన్నగారు స్థాపించిన టీడీపీలోకి మారారు. అన్నగారు ఎన్టీఆర్ కుమార్తె భువ‌నేశ్వరిని వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు. త‌ర్వాత పార్టీలో ఏర్పడిన సంక్షోభ స‌మ‌యంలో ఆయ‌న పార్టీకి అధ్యక్షుడుగా మారారు. త‌ర్వాత ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవ‌త్సరాలు పాలించారు.

విజన్ ఉన్న నాయకుడిగా….

నిజానికి అప్పటి వ‌ర‌కు రాష్ట్రాన్ని పాలించిన నాయ‌కుల తీరుకు, సీఎంగా చంద్రబాబు వేసిన అడుగుల ‌కు మ‌ధ్య చాలా వ్యత్యాసం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక క్రమ‌శిక్షణ క‌లిగిన నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌కు ఉద్యోగ క‌ల్పన‌, స్వయం ఉపాధి.. ఐటీ, అధునాత‌న సాంకేతిక‌త వంటి మేలిమి మార్గాల‌కు ఆయ‌న ప‌దును పెట్టారు.ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ హైద‌రాబాద్ కేంద్రంగా విరాజిల్లింది. మొత్తంగా ఐటీకి ప‌దును పెంచారు చంద్రబాబు.

జాతీయ రాజకీయల్లోనూ….

ఫ‌లితంగా రాష్ట్ర, రాష్ట్రేతర యువత కూడా ఐటీని స‌ద్వినియోగం చేసుకుని ల‌క్షల సంఖ్యలో ఉపాధి పొంద‌డంతోపాటు .. రాష్ట్రానికి కూడా ఆదాయం వ‌చ్చింది. ఇక‌, త‌ర్వాత కాలంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ ఎదిగారు. స‌మ‌యానికి త‌గు మాట్లాడే విధంగా ఆయ‌న రాజ‌కీయాల్లో దూసుకుపోయారు. జాతీయ స్థాయిలో ఆయ‌న ప్రతి ఒక్కరితోనూ క‌లుపుకొని పోయారు. ప్రతి విష‌యంలోనూ ఢిల్లీ రాజ‌కీయాల‌తో అల్లుకుపోయారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులోనూ చంద్రబాబు కీల‌క పాత్ర పోషించారు. క‌ర్ణాట‌క‌కు చెందిన దేవెగౌడ‌.. ప్రధాని కావ‌డంలోనుచంద్ర బాబు పాత్ర ఉంద‌నే విష‌యం తెలిసిందే.

సీఈవోగా ప్రకటించుకుని….

ఉమ్మడి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి సీఎం అయిన చంద్రబాబు ఐదేళ్లు సంపూర్ణంగా రాష్ట్రాన్ని న‌డిపారు. ఈ క్రమంలోనూ ఆయ‌న విజ‌న్ మంత్రాన్ని ప‌ఠించారు. తనకు తనే సీఈవోగా ప్రకటించుకున్నారు. ఆయ‌న ముందుచూపుతోనే అమ‌రావ‌తి వంటి న‌గ‌రం ఏర్పడేందుకు ఆస్కారం ఏర్పడింది. అయితే, ఇప్పుడు ఏర్పడిన ప్ర‌భుత్వం దీనిని వివాదం చేసింద‌నుకోండి అది వేరే విష‌యం. ఇక‌, విశాఖ‌లో ఐటీకి మార్గం వేశారు. అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా మ‌లిచారు. రైతుల నుంచి 33 వేల ఎక‌రాల భూమిని స‌మీక‌రించారు. ఉపాధి క‌ల్పన‌, ఉన్నత విద్యాల‌యాల రాక వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలోను, దేశంలోనూ విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్రబాబు ప్రస్థానం.. బ‌హు విభిన్నం. 70వ వడిలోకి అడుగుపెడుతున్నా ఆయన ఇప్పటికీ యువకుడిగానే వ్యవహరిస్తారు. ఆలోచిస్తారు. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు తెలుగు పోస్ట్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

Tags:    

Similar News