తమ్ముళ్ళకు చంద్రబాబు కొత్త టాస్కులు…ఆన్ లైన్ క్లాస్ లు

ఇదివరకు దీక్ష అంటే జనాలందరికీ తెలిసేది. హడావుడి కూడా ఉండేది. ఇపుడు కరోనా కాలం. ఇంట్లోనే ఉండాలి. లాక్ డౌన్ తో తమ్ముళ్ళంతా సెల్ఫ్ క్వారంటైన్ కి [more]

Update: 2020-04-22 15:30 GMT

ఇదివరకు దీక్ష అంటే జనాలందరికీ తెలిసేది. హడావుడి కూడా ఉండేది. ఇపుడు కరోనా కాలం. ఇంట్లోనే ఉండాలి. లాక్ డౌన్ తో తమ్ముళ్ళంతా సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయారు. ఇలాంటి వారికి చంద్రబాబు కొత్తగా టాస్కులు ఇస్తున్నారు. ఇంట్లో ఉండే నిరసనలు చేపట్టాలిట. ఏ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందో కాదు, ఇంట్లో భార్యాబిడ్డల ముందే కూర్చుని చేసే ఈ దీక్షలు ఎంతవరకూ ప్రభుత్వానికి వేడి పుట్టిస్తాయో తెలియదు కానీ తమ్ముళ్ళను రీఛార్జి చేయడానికి బాగానే ఉపయోగ‌పడుతోంది.

అభోజనంతోనే…..

లాక్ డౌన్ అన్నారు కానీ రాజకీయాలకు కాదుగా. అందుకే ట్విట్టర్, ఫేస్ బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరి రాజకీయం వారు జోరుగా చేసుకుంటున్నారు. జగన్ ని తిట్టాలన్నా, తమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవాన్నా కూడా స్మార్ట్ గా ఫోన్లో మేసేజ్ పాస్ చేస్తున్నారు. ఇపుడు దాన్ని మరింతగా అడ్వాన్స్ చేస్తూ ఇంట్లోనే దీక్షలకు తమ్ముళ్ళు తెరతీశారు. కరోనా బాధితులకు వైసీపీ సర్కార్ ఏమీ చేయడంలేదని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుధ్ధ నాగజగదీశ్వరరావు తాజాగా తన ఇంట్లోనే ఉందయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. మీడియాకు వాటి ఫోటోలను పంపి రాజకీయం బాగా రక్తి కట్టించారు. ఇపుడు మరో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా ఇదే తీరున తన ఇంట్లో జగన్ సర్కార్ కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ తన‌ ఇంట్లోనే భోజనం మానేసి ఒక రోజు దీక్ష చేపట్టారు.

ఇదేదో బాగుందిగా…..

బయటకు వచ్చి రాజకీయం చేద్దామంటే కరోనా ముప్పు పొంచి ఉంది. పైగా మామూలుగా అయితే భారీగా టెంట్లు వేయాలి. నాయకులను పిలవాలి, కార్యకర్తలను పోషించాలి. మీడియాను మంచి చేసుకోవాలి. అపుడు కానీ పబ్లిసిటీ రాదు, ఇపుడు ఇవేమీ లేకుండానే ఇంట్లో ఉంటూనే దీక్షలు చేపడితే రావాల్సిన పబ్లిసిటీ వస్తోంది. వెరైటీగా ఉందని మీడియాలో ప్రముఖంగా కవరేజీ వస్తోంది. పైగా పైసా ఖర్చు లేని రాజకీయం, కాలు కూడా కదపకుండానే కదన కుతూహల రాగం పాడుతూంటే తమ్ముళ్ళకూ బాగానే ఉంటోంది.

పాలిటిక్స్ ఫ్రం హోం…..

లాక్ డౌన్ వేళ అంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగానూ ఇపుడు బహుళ ప్రాచుర్యం పొందింది. మరి మాస్టర్ మైండ్ చంద్రబాబు కూడా తన పార్టీ వారికి ఇదే రకమైన సందేశం ఇస్తున్నారు. తరచూ పార్టీ నేతలతో వీడియో సమావేశాలు పెడుతూ ఆన్ లైన్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఇంటి నుంచే రాజకీయానికి కూడా శ్రీకారం చుట్టేసి అధికార పార్టీకి ఖంగు తినిపిస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆందోళనలు కొంతకాలమైనా వాయిదా పడతాయనుకుంటే ఇలా ఇంటి నుంచే పూటకో తమ్ముడు ఉద్యమాలు అంటూంటే అధికార పార్టీకి కొత్త తలనొప్పులే మరి.

Tags:    

Similar News