ముందున్నవన్నీ మంచిరోజులే.. భరోసా ఇస్తున్న బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో క్రమేపీ భరోసా పెరుగుతోంది. ధైర్యం ఎక్కువవుతోంది. గత పదినెలల నుంచి తాను పడుతున్న కష్టానికి కొంత అనుకూలత కన్పిస్తున్నట్లే కనపడుతుండటం చంద్రబాబులో [more]

Update: 2020-04-19 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులో క్రమేపీ భరోసా పెరుగుతోంది. ధైర్యం ఎక్కువవుతోంది. గత పదినెలల నుంచి తాను పడుతున్న కష్టానికి కొంత అనుకూలత కన్పిస్తున్నట్లే కనపడుతుండటం చంద్రబాబులో గతంలో ఎన్నడూ లేని ఉత్సాహం కల్పిస్తుంది. లాక్ డౌన్ నుంచి హైదరాబాద్ లో ఉన్నా ఉదయం పది గంటల నుంచే పార్టీ కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఐదు గంటల వరకూ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు.

ఓటమి పాలయిన దగ్గర నుంచి……

ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి పాలయిన తర్వాత నుంచి చంద్రబాబు కొంత డీలా పడ్డారు. ఊహించని విధంగా కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో ఆయన నిరుత్సాహపడ్డారు. ఏపీకోసం తాను చేసిన కృషిని, అభివృద్ధిని ప్రజలు పట్టించుకోలేదని అంతర్గత సమావేశాల్లో సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించి ఆవేదన చెందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతుండటంతో నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

జిల్లా సమీక్షల పేరిట…..

అనేక మంది నేతలు పార్టీని వదలి వెళ్లిపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి దగ్గరయ్యారు. ఇక క్షేత్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు ఫలితాలు వచ్చిన నెల రోజుల నుంచి జిల్లా సమీక్ష పేరిట కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ముందు నేతలను దారికి తెచ్చుకుంటే తర్వాత క్యాడర్ ఆటోమేటిక్ గా వస్తుందనుకున్న చంద్రబాబు విశాఖ జిల్లా సమీక్ష సమావేశంలోనే మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో మోడీ అండ అవసరమని ఓడిన, గెలిచిన నేతలందరూ కోరుకుంటుండటమే ఇందుకు కారణం.

గత నాలుగు రోజుల నుంచి…..

తాజాగా మోదీ ఫోన్ లో చంద్రబాబుతో మాట్లాడటం ఆయన పార్టీ పరంగా చక్కగా వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో బీజేపీతో కలసి ప్రయాణం చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే నేతల్లో మాత్రం ఆ ఫోన్ తర్వాత ధైర్యం పెరిగిందనే చెప్పాలి. ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నేతలతో మాట్లాడుతూ మోదీతో తన సంభాషణల విషయాలను ప్రస్తావిస్తున్నారు. త్వరలోనే తాను ఢిల్లీ వెళతానని, మంచిరోజులు ముందున్నాయని చంద్రబాబు నమ్మకంగా చెబుతుండటంతో నేతల్లో కూడా ధైర్యం పెరుగుతుందంటున్నారు. కరోనా సమస్య ముగిసిన తర్వాత తడాఖా చూపిస్తామంటున్నారు.

Tags:    

Similar News