క్యాలండర్ మారింది… కల నిజమవుతోందా?

ఇపుడు అంతా కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సాధారణ పరిస్థితి కనుక ఉంటే మాత్రం అంతా జగన్ అద్భుత విజయాన్ని బాబు పరాజయాన్ని మరో మారు [more]

Update: 2020-04-16 05:00 GMT

ఇపుడు అంతా కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సాధారణ పరిస్థితి కనుక ఉంటే మాత్రం అంతా జగన్ అద్భుత విజయాన్ని బాబు పరాజయాన్ని మరో మారు గుర్తు చేసుకునే వారు. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2019 ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు పెట్టారు. దాంతో చంద్రబాబు జాతకాన్ని జనం నాడు తిరగరాశారు. ఆ తరువాత యాభై రోజులకు ఫలితాలు వచ్చాయి కానీ కఠినమైన తీర్పుని జనం చంద్రబాబు నుదుటిన రాసి ఇంటికి పంపించినది మాత్రం సరిగ్గా ఏప్రిల్ 11వ తేదీనే.

జన వెల్లువలా…..

తొలి విడతలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో వెల్లువలా జనం వచ్చారు ఓ వైపు పొరుగు రాష్ట్రం తెలంగాణాలో పెద్దగా స్పందన లేదు, ఎందుకంటే అంతకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి. కేవలం పార్లమెంట్ ఎన్నికలే అక్కడ జరిగాయి. దాంతో ఎన్నికల హడావుడి అంతా ఏపీలోనే కనిపించింది. అంతకు ముందే ఏపీలో జగన్ కి అనుకూల వాతావరణం ఏర్పడడంతో ఆయన గెలుస్తారని అంతా అనుకున్నా చంద్రబాబు రాజకీయ చాతుర్యం మీదనే మరోవైపు అందరికీ నమ్మకం ఉండేది. ఆయన తనదైన చాణక్యంతో ఏదో విధంగా ఒడ్డున పడతారు అనుకున్నారు. దాంతో భారీ ఎత్తున జరిగిన ఏపీ ఓటింగ్ కూడా టీడీపీ అనుకూలమేనన్న భావన ఫలితాల వరకూ సాగుతూ వచ్చింది.

ఇంతటి మార్పు…..

నాడు జగన్ ప్రభంజం ఎటు చూసినా సాగింది. జగన్ వస్తే ఏపీ రూపురేఖలు మారిపోతాయని అంతా విశ్వసించారు. అందుకే చరిత్రలో ఎరుగని విజయం అందించారు. జగన్ పాలనకు ఏడాది కూడా నిండలేదు. కానీ ఏదో తెలియని అసంతృప్తి జనాల్లో వుంది. జగన్ అంటే చాలా అనుకున్నామే.. ఇలా అవుతోందేంటి అన్న బాధ కూడా అటు పార్టీ అభిమానుల్లోనూ కలుగుతోంది. జగన్ దూకుడుగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ వర్గాలకూ రుచించడంలేదు. అదే సమయంలో జగన్ పాలనాపరంగా తడబాట్లూ, పొరపాట్లూ చేస్తున్నారు. అవి ప్రజాదర‌ణను తగ్గిస్తాయేమోనన్న బెంగ కూడా పార్టీ హితులలో ఉంది.

తేరుకున్నారా…?

ఇక టీడీపీ జీవిత కాలంలోనే ఎన్నడూ ఎరుగని ఓటమిని పొందిన తరువాత టీడీపీ పని సరి అని అంతా భావించారు. కానీ జగన్ అనుభవ రాహిత్యం, తొందరపాటుతనం, ఆవేశపూరితమైన నిర్ణయాల కారణంగా చంద్రబాబుకు కొత్త ఊపిరి ఊరట దక్కుతోందని వైసీపీ నుంచే ఇపుడు వినిపిస్తోంది. జగన్ కొన్ని విషయాల్లో మరీ పంతంగా ఉండడం కూడా తటస్థులకు, విద్యావంతులకు సహించడంలేదు. ఏది ఏమైనా జగన్ ప్రాభవంతో ఇదే నెలలో 2019 గడిస్తే జగన్ రాజకీయంగా కొంత తగ్గినట్లుగా క్యాలండర్ మారేసరికి కనిపించడం అంటే అది కచ్చితంగా జగన్ స్వయంకృతాప‌రాధంగా చెప్పాల్సిఉంటుందేమో.

Tags:    

Similar News