సూచనలా? సూటిపోటి మాటలేనా?

విధ్వసం చేశారని మీరంటున్నారు.. విధ్వంసమయిన వాటిని సరిచేస్తున్నమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు కరోనా నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలని సూచనలు చేస్తున్నారా? లేక సూటిపోటి మాటలతో [more]

Update: 2020-04-09 11:00 GMT

విధ్వసం చేశారని మీరంటున్నారు.. విధ్వంసమయిన వాటిని సరిచేస్తున్నమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు కరోనా నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలని సూచనలు చేస్తున్నారా? లేక సూటిపోటి మాటలతో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. వైద్యుడి సస్పెన్షన్ విషయాన్ని కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. అసలు వైద్యుడిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనేది చంద్రబాబుకు తెలియదా? తెలిసే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

డాక్టర్ ఆరోపణల్లో…..

నిజానికి నర్సీపట్నం ఆసుపత్రి అసలు కోవిడ్ ఆసుపత్రి కాదు. అక్కడ ఎటువంటి కరోనా పేషెంట్లు లేరు. అయితే డాక్టర్ సుధాకర్ మండలంలో జరుగుతున్న మున్సిపల్ సమీక్ష సమావేశానికి వచ్చి మరీ అల్లరి చేయడంతోనే ప్రభుత్వం సీరియస్ అయింది. మాస్కులు ఇచ్చారని, అయితే ఒక్కొక్కరికీ ఒక్కటే ఇస్తున్నారని డాక్టర్ సుధాకర్ చెప్పారు. నిజానికి ఈ ఆరోపణలు చేసిన సుధాకర్ ఎనస్తీషియా డాక్టర్. ఈయనకు కరోనాకు సంబంధం లేదన్నది వైసీపీ నేతల వాదన.

కావాలనే చేశారంటున్న…..

కాని చంద్రబాబు మాత్రం డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తే వైద్యులు, వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతింటుందని లేఖ రాయడం చర్చనీయాంశమైంది. నిజానికి సుధాకర్ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించారన్నది వైసీపీ నేతల చేస్తున్న వాదన. మాస్క్ లు, వైద్యులు ఉపయోగించే పరికరాల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా సుధాకర్ కావాలనే విపత్తు సమయంలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు సుధాకర్ వివిధ టీవీ డిస్కషన్ లలో కూడా వన్ సైడ్ గా మాట్లాడి కరోనా కోసం శ్రమిస్తున్న అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీశారని ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది.

ఎవరిది విధ్వసం?

ఇక విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. గతంలో మెడిటెక్ జోన్ లో పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారన్నది వైసీపీ ఆరోపణ. దానిని సరిచేసేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. అన్నా క్యాంటిన్ల కాంట్రాక్టుల్లో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని, అందువల్లనే వాటిని మూసివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద కరోనా సమయంలో చంద్రబాబు సూటిపోటి మాటలతో రాస్తున్న లేఖలకు వైసీపీ కూడా ధీటుగానే జవాబిస్తుండటంతో ఏపీలో రాజకీయ రచ్చ ఆగడం లేదు.

Tags:    

Similar News