వారంతా ఇప్పుడు దూరమయిపోయినట్లేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా అనుకుంటే సాధించే వ‌ర‌కు ఒదిలి పెట్టర‌నే పేరు తెచ్చుకున్నారు. అది ఎంత క‌ష్టమైన కార్యమైనా ఆయ‌న ప‌ట్టుబ‌డితే అది సానుకూలంగా సాగ‌వ‌లసిందే. [more]

Update: 2020-04-18 15:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా అనుకుంటే సాధించే వ‌ర‌కు ఒదిలి పెట్టర‌నే పేరు తెచ్చుకున్నారు. అది ఎంత క‌ష్టమైన కార్యమైనా ఆయ‌న ప‌ట్టుబ‌డితే అది సానుకూలంగా సాగ‌వ‌లసిందే. చంద్రబాబుకు సానుకూలం కావాల్సిందే. అనే మాట‌లు కూడా టీడీపీలో త‌ర‌చుగా వినిపిస్తాయి. అయితే, ఇలాంటి వ్యూహాలు అన్నిచోట్లా ఫ‌లిస్తాయా? చంద్రబాబుకు అన్ని జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహం ఉందా? అంటే క‌డప వంటి సంక్లిష్టమైన జిల్లాను గ‌మ‌నిస్తే. ఇక్కడ చంద్రబాబు వ్యూహాలు సాగ‌లేద‌నే చెప్పాలి. టీడీపీ శ్రేణుల‌కు ఒకింత బాధ‌గా ఉన్నప్పటికీ క‌డ‌ప జిల్లాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు ఆధిప‌త్యం చ‌లాయించాల‌ని, త‌న మాట నెగ్గాల‌ని ఎంతో ప్రయ‌త్నించారు.

కడపలో తొక్కాలని…..

1997 నుంచి కూడా ఆయ‌న అధికారంలో ఉన్న స‌మ‌యంలో క‌డ‌ప‌ను కేంద్రం చేసుకుని రాజ‌కీయం చేశారు. త‌న‌ను టార్గెట్ చేసి న వైఎస్‌ను క‌డ‌ప‌లో తొక్కి పెట్టేందుకు చంద్రబాబు చేయ‌ని వ్యూహం లేదు. బాబు ఎన్ని ప్రయ‌త్నాలు చేస్తున్నా 2004లో జిల్లాలో క‌మ‌లాపురం సీటుతో, 2009లో టీడీపీ ప్రొద్దుటూరు సీటుతో స‌రిపెట్టుకుంటే… 2014లో రాజంపేట‌తో స‌రిపెట్టుకుంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక‌, ఆయ‌న కుమారుడు, ప్రస్తుత సీఎం జ‌గ‌న్ విషయంలోనూ ఇదే త‌ర‌హా వ్యూహాల‌తో చంద్రబాబు ముందుకు సాగారు. ఆయ‌న అధికారంలో ఉన్న గ‌త ఐదేళ్లలో క‌డ‌ప‌లో వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు.

జగన్ పైన కూడా….

జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రైతుల‌కు ప‌ట్టిసీమ నుంచి పులివెందుల‌కు సాగునీటిని అందించారు. ఇక‌, క‌డప జిల్లా వాసుల‌ను గుండుగుత్తుగా ఆక‌ట్టుకునేందుకు క‌డప ఉక్కు ఫ్యాక్ట‌రీకి శంఖు స్థాప‌న కూడా చేశారు. కీల‌క‌మైన నాయ‌కుల‌ను త‌న‌వైపునకు తిప్పుకొన్నారు. వారికి త‌న హ‌యాంలో మంత్రి ప‌దవులు కూడా క‌ట్టబెట్టారు. అయినా కూడా చంద్రబాబు క‌డ‌ప‌లో త‌న హ‌వాను సాగించ‌లేక పోయారు. జ‌మ్మల‌మ‌డుగు లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేస్తూ వైరి శ‌త్రువులుగా ఉన్న రామ‌సుబ్బారెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి వాళ్లను చంద్రబాబు త‌న పార్టీలోకి చేర్చుకుని ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆదినారాయ‌ణ రెడ్డి క‌డ‌ప ఎంపీగాను, రామ‌సుబ్బారెడ్డి జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇద్ద‌రూ చిత్తుగా ఓడిపోయారు.

సన్నిహితులంతా…?

ఎన్నిక‌ల త‌ర్వాత చంద్రబాబుకు అత్యంత మిత్రులుగా చ‌లామ‌ణి అయిన ఇదే జిల్లాకు చెందిన స‌తీష్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ర‌ణ రెడ్డి వంటివారు పార్టీని ఎప్పుడో విడిచి పెట్టేశారు. సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌లు చంద్రబాబు వ్యూహంలో భాగంగానే బీజేపీలో చేరార‌ని అప్పట్లో ప్రచారం జ‌రిగింది. అయితే, వారు పార్టీ లో చేరేప్పుడు ఇది వ్యూహం అయితే అయి ఉండొచ్చు కానీ, త‌ర్వాత బీజేపీ ప్రాధాన్యం మారిన నేప‌థ్యంలో వారు చంద్రబాబుకు దూర‌మ‌య్యారు.

జెండా ఎగరేసేందుకు కూడా…..

మ‌రో కీలక నేత‌, ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి ఉన్నప్ప‌టికీ.. ఆయ‌న పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే ప్రయ‌త్నం కూడా చేయ‌లేక పోతున్నారు. మొన్నామ‌ధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడ పార్టీ కార్యాల‌యంలో బీటెక్ ర‌వి ఒక్కరే వ‌చ్చి జెండా ఎగ‌రేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. క‌నీసం ప‌ట్టుమ‌నిప‌ది మంది కూడా లేక‌పోవ‌డంతో ఆయ‌న వెనువెంట‌నే పార్టీ కార్యాల‌యం నుంచి నిష్క్రమించారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో క‌డ‌ప‌లో టీడీపీ ఇక‌, నామ‌రూపాలు ఉన్నట్టా? లేన‌ట్టా? అనే విష‌యాన్ని చంద్రబాబు డిసైడ్ చేసుకోవాలి! ఇప్పటికైనా పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు ప్రయ‌త్నించాలి.

Tags:    

Similar News