లక్కు కోసం లెక్క కట్టాల్సిందేనా?

ప్రపంచమంతా కరోనా కోరలు చాచి బుస కొడుతోంది. దాన్ని ఎదిరించిన వారిని మొనగాడు అనరు. బతుకు జీవుడా అనుకుంటారంతే. కానీ ఏపీలో చూసుకుంటే మాత్రం కరోనా రాజకీయం [more]

Update: 2020-04-08 02:00 GMT

ప్రపంచమంతా కరోనా కోరలు చాచి బుస కొడుతోంది. దాన్ని ఎదిరించిన వారిని మొనగాడు అనరు. బతుకు జీవుడా అనుకుంటారంతే. కానీ ఏపీలో చూసుకుంటే మాత్రం కరోనా రాజకీయం వీర లెవెల్లో సాగుతోంది. కరోనాని కనుక గట్టిగా నియంత్రిస్తే జగన్ పొలిటికల్ గా ఇంకా పెద్ద వాడు అయిపోతాడేమోన‌ని పసుపు తమ్ముళ్ళు తల్లడిల్లిపోతున్నారు. అందుకే వారు తెల్లారుతూనే చంద్రబాబు ప్రస్తావన‌ తెస్తూ మా చంద్రబాబు మంచి పాలకుండు, ఇలాంటి విపత్తులను ఒంటిచేత్తో ఎన్నో అణచేశాడు. జగన్ కి ఏమీ చేతకావడం లేదు. పాలన పడకేసింది అంటూ అవాకులూ చవాకులు మాట్లాడుతున్నారు. ఓ వైపు కరోనాతో జనం బిక్కచచ్చిపోయి ఉన్నారు. ఎపుడు ఒడ్డున పడతాం దేవుడా అని కోటి మొక్కులు మొక్కుకుంటున్నారు. కానీ కరోనా కంట్రోలింగ్ లో పాలకుడుగా జగన్ విఫలం కావాలని క్రూరమైన ఆలోచన ప్రధాన విపక్షంలో ఉందని సాక్షాత్తు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారేంటే ఇది ప్రమాదకరమైన రాజకీయమే మరి.

అంతా కలసి…

ఇప్పటివరకూ ప్రపంచం తలకెత్తుకున్న సమస్యలు వేరు, కరోనా ఒక్కటి మరో ఎత్తు. అగ్ర రాజ్యంగా, ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికావే కరోనా ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ మూల్యం చెల్లించుకుంటోంది. అలాంటికి పేద దేశం, పెద్ద జనాభా ఉన్న భారత్ లో కరోనా పడగ విప్పితే బతికి బట్ట కట్టేవారెవరో లక్కుని చూసి లెక్క వేసుకోవాల్సిందే. అంత‌టి ప్రమాదకారి ముంచుకువస్తూంటే బాధ్యత లేకుండా టీడీపీ పెద్దలు మాట్లాడడం వెగటు పుట్టిస్తోంది. రాజకీయాలు చేసే వేళ కాదని తెలిసి కూడా పదే పదే అదే చేస్తున్నారంటే దారుణమనే అనాలి.

హ్యాండిల్ చేయలేదట…

చంద్రబాబు అయితే జగన్ సరిగ్గా హ్యాండిల్ చేయడంలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. హ్యాండిల్ చేయడానికి ఏముందని అక్కడ. కరోనా విషయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సినవి తీసుకుంటారు. ఇక్కడ కావాల్సింది జనంలో చైతన్యం. తుపానో, సునామీవో అయితే జనాలను అందరికీ ఒక చోటకు చేర్చి సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇది కనబడని శత్రువు. కోట్లాది మంది జనంతో చెలగాటం ఆడుతోంది. ఎవరు ఇంట్లో ఉంటున్నారో బయటకు వస్తున్నారో నిఘా పెట్టడం బ్రహ్మదేవుడికైన అసాధ్యమే. అందువల్ల జన చైతన్యం ఒక్కటే ఇపుడు తరుణోపాయం. ప్రభుత్వాలు ఒక్కటే ఆ పని చేయలేవు. ఇంతవరకూ పదవులు చేపట్టి అనుభవం గడించిన టీడీపీ లాంటి పార్టీలు ఈ సమయంలొ చేతనైనంతగా సాయం చేయాలి. కనీసం మంచి మాటలైనా చెప్పాలి.

క్రెడిట్ దక్కరాదా…?

ఎటువంటి విపత్తు అయినా దాన్ని అరికట్టినపుడు కచ్చితంగా పాలకులకు పేరు వస్తుంది. అది మోడీ అయినా, కేసీఆర్ అయినా జగన్ అయినా అతీతం కాదు. దాన్ని రాజకీయంగా ఎంతవరకూ మార్చుకుంటారన్నది వారి చేతల్లో, చేతుల్లో ఉంది. అది ఎపుడో భవిష్యత్తులో జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే మోకాలడ్డడం అంటే ఆపదలో ఉన్న ప్రజల ప్రయోజనాలకు అడ్డం పడడమే. ఇది ఎలా ఉందంటే దేవతలు యాగం చేస్తూంటే దానవులు అడ్డుపడినట్లుగా అని చెప్పాలేమో. ఏది ఏమైనా రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదిపుడు. కానీ చంద్రబాబు నుంచి చిట్టి తమ్ముడు వరకూ అందరూ తెల్లారుతూనే ఇదే గోల పెడుతున్నారు. జనాలను గందరగోళంలోకి నెడుతున్నారు. మిగిలిన పార్టీలైన బీజేపీ సీపీఎం, కాంగ్రెస్ సంయమనం పాటించి తమ వరకూ సహాయం చేస్తున్నాయి. ఆ పాటి సోయి లేకపోబట్టే టీడీపీ ఇపుడు జనం చేత కూడా విమర్శలు పడాల్సివస్తోంది. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు తన పంధా మార్చుకుని తమ్ముళ్ళను ముందుకు నడిపించాలి. ఏపీ నుంచి కరోనా వైరస్ ని తరిమికొట్టే ఉద్యమంలో భాగం కావాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News