బాబు కంటే జగన్ ఘనుడేనటగా..టీడీపీ ఇదే చెప్పిందా?

పరిపాలనను ఎవరైనా అభివృధ్ధి, ఆర్ధిక పరిస్థితిని బట్టే లెక్క కడతారు. ఎవరెంత మంచి పేరు తెచ్చుకున్నా ఈ పారామీటర్లను దాటకపోతే అసమర్దుడు అనే అంటారు. ఏపీ విషయానికి [more]

Update: 2020-04-07 00:30 GMT

పరిపాలనను ఎవరైనా అభివృధ్ధి, ఆర్ధిక పరిస్థితిని బట్టే లెక్క కడతారు. ఎవరెంత మంచి పేరు తెచ్చుకున్నా ఈ పారామీటర్లను దాటకపోతే అసమర్దుడు అనే అంటారు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబుని మంచి పాలకుడుగా టీడీపీ తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఎందుకంటే చంద్రబాబే వారికి దారం, ఆధారం. ఆయన ఇమేజ్ తోనే పార్టీ భవిష్యత్తు ముడిపడిఉంది. ఇక చంద్రబాబు విషయానికి వస్తే దేశంలోనే తనకంటే ఉత్తమ పాలకుడు, సీనియర్ మోస్ట్ లేడన్న అభిప్రాయంతో ఉంటారు. ఆయనతో పోలిసే జగన్ ఏ విధంగానూ సరితూగడన్నది తమ్ముళ్ళ వితండ వాదన.

అలా ప్రచారం….

జగన్ గద్దెనెక్కాక ఏపీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, ఒక్క పైసా కూడా ఎక్కడా రాలేదని టీడీపీ ప్రచారం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. జగన్ కి సంపద సృష్టించడం రాదని, ఆయన ఎక్కడికీ వెళ్ళి కొత్త రూపాయి తేలేరని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు. ఇక జగన్ వచ్చాక పరిశ్రమలు మూతపడ్డాయని, అన్ని వైపుల నుంచి ఆదాయం పడిపోయిందని కూడా చంద్రబాబు ఇప్పటిదాకా చెబుతూ వస్తున్నారు. దాంతో జగన్ వంటి అసమర్ధుడిని గద్దెనెక్కించి జనం తప్పుచేశారన్నీ భావన కలిగించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం అన్నది తెలిసిందే.

నిజం చెప్పేశారా….?

ఇక జగన్ ని తిట్టాలనుకుని ఎప్పటిలాగానే టీడీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. జగన్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేంత సీన్ లేదా అని కూడా టీడీపీ తాజగా ఆడిగేసి కడిగేసిపారేస్తోంది. ఇలా జగన్ ని ఆక్షేపిస్తూ టీడీపీ సీనియర్ నేత దూలిపాళ్ళ నరేంద్ర రాసిన ఒక లేఖలో చెప్పకనే కొన్ని నిజాలు చెప్పేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి వచ్చింది లక్షా 57 వేల కోట్లు అయితే. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి లక్షా 87 వేల రూపాయలు నిధులు వచ్చాయని పొరపాటున నిజం చెప్పేశారు. అంటే జగన్ సర్కార్ చంద్రబాబు కంటే కూడా ముప్పయి వేల కోట్ల రూపాయలు అదనంగా ఏపీకి ఒక్క ఏడాదిలోనే సాధించిందని నరేంద్ర ఆ లేఖలో అసలు గుట్టు విప్పి చెప్పేశారు.

ఇపుడేమంటారో…?

మరి దీన్ని వైసీపీ నేతలు ఇపుడు బాగానే పట్టుకున్నారు. ఏపీకి ఆదాయం లేకుండా జగన్ చేశాడని, ఇదే మా చంద్రబాబు ఉంటే ఆదాయం పెద్ద ఎత్తున తీసుకువచ్చేవాడని ఇన్నాళ్ళూ కోతలు కోశారని, ఇపుడేమంటారు అని గట్టిగా తగులుకుంటున్నారు. చంద్రబాబు కంటే జగన్ ఘనుడు కాబట్టే ఏపీకి ఆదాయం ముప్పయి వేల కోట్లు కేవలం తన పది నెలల పాలనలో పెరిగిందని అని వారు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. జగన్ ని ప్రభుత్వ ఉద్యోగుల ముందు దోషిగా నిలబెడదామని కష్టపడి తీసిన లెక్కలు చివరికి తమకే చిక్కులు తేవడంతో తమ్ముళ్ళ నోట మాట ఇపుడు రావడంలేదుట. మొత్తానికి జగన్ పాలన లో నిధులు బాగానే వస్తున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. వచ్చిన ఆదాయాన్ని ఏ రంగానికి ఎలా ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేస్తున్నారన్నది కూడా చూడాలి. కేవలం సంక్షేమం మీదనే ఖర్చు చేస్తే అది అనుత్పాదనకే పోతుంది. అది వైసీపీ పెద్దలు కూడా గుర్తిస్తే మంచిదేమో.

Tags:    

Similar News