ఎవరైతే ఏంటి..? వైసీపీని దెబ్బకొట్టాల్సిందే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అనేక జిల్లాల్లో పార్టీ నేతలే చేతులు ఎత్తేశారు. సీనియర్ నేతలు [more]

Update: 2020-03-28 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అనేక జిల్లాల్లో పార్టీ నేతలే చేతులు ఎత్తేశారు. సీనియర్ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితర నేతలు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ చేసే అవకాశముండటంతో చంద్రబాబు మరో ఆలోచన చేస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో…..

ప్రధానంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. భయపెట్టో, బతిమాలో వారిని నామినేషన్ వేయకుండా వైసీపీ అడ్డుకుందంటున్నారు. మరోవైపు స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోక పోవడంతో పోటీ చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత చూస్తే అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేదు.

వామపక్ష పార్టీ అభ్యర్థులను….

దీనిపై కారణాలను తొలుత తెలుసుకున్న చంద్రబాబు అక్కడ ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వామపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేశారా? అన్న విషయాన్ని ఆరా తీశారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కూడా చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో సీపీఐ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను టీడీపీ తీసుకుంది.

రీ షెడ్యూల్ చేయకుంటే…?

ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కోరిన చోట రీ షెడ్యూల్ చేయకుంటే వామపక్ష పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అలాగే అక్కడ జనసేన అభ్యర్థులున్నా మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయిపోతున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా వివరాలు తెప్పించుకుంటున్నారు. మొత్తం మీద టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని చోట ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే చెప్పాలి.

Tags:    

Similar News