చేవ తగ్గలేదు.. కానీ? కఠిన సమయమేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది కఠిన సమయం. నిజానికి ఆయన అనుభవానికి పరీక్ష అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నో సంక్షోభాలను అధిగమించామని, వాటిని తమకు అనుకూలంగా [more]

Update: 2020-03-30 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది కఠిన సమయం. నిజానికి ఆయన అనుభవానికి పరీక్ష అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నో సంక్షోభాలను అధిగమించామని, వాటిని తమకు అనుకూలంగా ఎన్నోసార్లు మలుచుకున్నామని చంద్రబాబు అనుకోవచ్చు. కానీ అప్పుడు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఈ నాలుగేళ్ల పాటు చంద్రబాబు పార్టీని ఎలా లాక్కొస్తారన్న దానిపైనే తెలుగుదేశం పార్టీలో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.

ఎన్నో సంక్షోభాలు చూసినా…..

గతంలో చంద్రబాబు ఎన్నో సంక్షోభాలు చూసినా అప్పటి పరిస్థితులు వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీలయినంత స్పేస్ ఉండేది. అప్పుడు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఒక్కటే. అదీ జాతీయ పార్టీ కావడంతో చంద్రబాబుకు పెద్దగా సమస్యలు తలెత్తలేదు. బీజేపీ అప్పటికి పెద్దగా పుంజుకోలేదు. ప్రజారాజ్యం ఆవిర్భావం దెబ్బకు టీడీపీ దెబ్బతిన్నా దాన్ని తిరిగి కాంగ్రెస్ లో కలిపేయడంతో చంద్రబాబు తిరిగి పార్టీకి ఊపిరి తేగలిగారు.

రాష్ట్ర విభజనతో….

కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆ పరిస్థితి లేదు. ఇక్కడ జాతీయ పార్టీలకు అవకాశం లేదు. టీడీపీ, వైసీపీలు రెండు బలంగానే ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ అవకాశాలు వచ్చే ఎన్నికల్లో కూడా ఉండవనే చెప్పాలి. మరో ప్రాంతీయ పార్టీ జనసేన కూడా ఒక సామాజికవర్గం అండతో బలంగానే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఇంతకు ముందు లాగా పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవడం అంత తేలికైన పనికాదు. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సీనియర్ నేతలు సయితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.

రెక్కల కష్టం మీదనే….

నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. తనలో ఏమాత్రం చేవ తగ్గలేదని నిరూపిస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి ద్వారా నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు రెక్కల కష్టం మీదనే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది. మరి చంద్రబాబుకు ఈసారి అది సాధ్యమవుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News