ఆయనపై ఆశలు వదులుకోవాల్సిందేనా ?

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అని మహాకవి శ్రీశ్రీ ఓ ప్రభోదాత్మక గీతాన్ని ఏనాడో జాతికి వినిపించారు. ఎవరెన్ని చెప్పినా ఆపదలో ఉన్నవాడు [more]

Update: 2020-04-04 13:30 GMT

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అని మహాకవి శ్రీశ్రీ ఓ ప్రభోదాత్మక గీతాన్ని ఏనాడో జాతికి వినిపించారు. ఎవరెన్ని చెప్పినా ఆపదలో ఉన్నవాడు సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. ఇపుడు ఆపదలో తెలుగుదేశం పార్టీ ఉంది. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఒక గదిలో పుట్టిన టీడీపీ ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే ఎదిగింది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా నాలుగు దశాబ్దాల జాతీయ రాజకీయాలను అనేక సమాయాల్లో ప్రభావితం చేసింది. కీలకమైన మలుపులు తిరిగేలా చేసింది, చూసింది. అటువంటి టీడీపీకి ఘన చరిత్ర అయితే ఉంది. కానీ గట్టి భవిష్యత్తు ఉందా అన్నదే ఇపుడు తమ్ముళ్ళను వేధిస్తున్న ప్రశ్న.

బాబు చాలరుగా ….

చంద్రబాబుకు వ్యూహకర్తగా నూరు మార్కులు వేసే కరడు కట్టిన అభిమానులు, కార్యకర్తలు సైతం ఆయన జనాకర్షణకు మాత్రం తక్కువ మార్కులే వేస్తారు. చంద్రబాబు వ్యూహాలు అర్జునుడు లాంటి శరసంధానం చేసే వారు పక్కన ఉంటేనే పనికి వస్తాయి. అయితే చంద్రబాబు తాను పొత్తులు లేకుండా ఎపుడూ ఎన్నికల్లో పార్టీని ఒంటరిగా పెట్టి గెలవలేదు. ఇక 1999, 2014 టీడీపీ విజయాల్లో మేజర్ వాటా చంద్రబాబు వ్యూహాలు, బీజేపీ వాజ్ పేయ్, మోడీల ఇమేజ్ అని అంతా అంటారు. అవేమీ లేకుండా వెళ్ళడం వల్లనే 2019 ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓడారని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు ఓ వైపు బలమైన పార్టీ వైసీపీ అధికారంలో ఉంది. దానికి నాయకుడు, ముఖ్యమంత్రి హోదాలో యువనేత జగన్ ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే బాబు ఒక్కరూ చాలరు అన్నది టీడీపీలోని వినిపిస్తున్న మాట.

చినబాబు అలా…..

ఇక పార్టీలో ఉన్న లోకేష్ ని ప్రమోట్ చేస్తూ చంద్రబాబు తాను ముందుండి నడిపించాలనుకుంటున్నారు. అయితే లోకేష్ నాయకత్వం మీద పార్టీలో నమ్మకం తక్కువ. పైగా అయన మంగళగిరిలో ఓటమిపాలై పరాజితుడిగా ముద్ర వేయించుకున్నారు. అటువంటిది ఆయన్ని నమ్మి ఎన్నికల గోదాలోకి దిగే సాహసం మాత్రం టీడీపీలో ఎవరూ చేయలేమని అంటున్నారు. అందుకే ముందు చూపు ఉన్న వారంతా వైసీపీలోకి సర్దుకుంటున్నారు. మరి కొందరు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

అలా చేయరుగా…?

ఇక చంద్రబాబుకు లోకేష్ మీద మితిమీరిన ప్రేమ, తన వారసుడు ఆయనే కావాలన్న పట్టుదల కారణంగా చేతిలో ఉన్న అవకాశాలు వదిలేసుకుంటున్నారని అన్న వారూ ఉన్నారు. బావమరిది బాలయ్యకు కీలక బాధ్యతలు అప్పగించినా ఆయన్ని కొంత ముందు పెట్టి కధ నడిపించినా టీడీపీకి కొంత శక్తి వస్తుంది. కానీ చంద్రబాబు ఆ పని చేయడానికి సిధ్ధంగా లేరు. మరో వైపు యువ నటుడు జూనియర్ ఎన్టీయార్ ని టీడీపీలో మంచి హోదాలోకి తెచ్చినట్లైతే పార్టీ ఆటమెటిక్ గా పుంజుకుంటుంది అన్న వాదనలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ బాబు ససేమిరా అన్న ధోరణిలో ఉన్నారు.

ఇక రానట్లే…

మరి ఈ సంగతులు అన్నీ బాగా తెలిసిన వాడు కావడంతోనే జూనియర్ ఎన్టీయార్ తన సినిమాల జోరు బాగా పెంచేశారు. తాత పెట్టిన పార్టీ దారుణంగా ఓడినా కూడా ఆయన పట్టించుకోవడంలేదు. పైగా ఇపుడు జూనియర్ సరికొత్త అవతారం ఎత్తేశారు. తన తండ్రి హరి క్రిష్ణ పేరు మీద ఆయన నిర్మాణ సంస్థను పెట్టి మరీ వరసగా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారు. అంటే రానున్న కాలమంతా జూనియర్ సినిమాల్లో ఫుల్ బిజీ అని చెప్పకనే చెప్పేశారు. ఈ పరిణామాలతో జూనియర్ అభిమానులు, టీడీపీలో ఉన్న తమ్ముళ్ళు ఇక ఆయన రాజకీయాల వైపు రాడా అని దిగాలు పడుతున్నారు. ఈ మొత్తం సీన్ చూసినపుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ల నాయకత్వంలోనే టీడీపీ వైసీపీతో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నది పక్కా క్లారిటీగా తేలుతున్న విషయం.

Tags:    

Similar News