బాబు హోదా ఇదీ అని చూపించిందా ?

ప్రతి వయసుకు ఒక చోటు ఉంటుంది. అక్కడ ఉంటేనే హోదా, గౌరవం ఉంటుంది. ముదిమి వయసులో ఉన్న వారు అంటే ఈ దేశ అనుభవ సంపద. వారు [more]

Update: 2020-03-23 08:00 GMT

ప్రతి వయసుకు ఒక చోటు ఉంటుంది. అక్కడ ఉంటేనే హోదా, గౌరవం ఉంటుంది. ముదిమి వయసులో ఉన్న వారు అంటే ఈ దేశ అనుభవ సంపద. వారు ఉండాల్సిన చోటు కూడా గొప్పది. వారు తెర ముందు నుంచి తెర వెనకకు హుందాగా తప్పుకుని సలహాలు ఇస్తే తరువాత తరం నడిపిస్తుంది. సహజంగా కుటుంబ జీవన‌ వ్యవస్థలో జరిగేది ఇదే. ఇపుడు అన్ని విలువలూ గతి తప్పి మానవాళికి మతి తప్పిన వేళ కరోనా రక్కసి ఎవరు చోటు ఏంటి అన్నది దగ్గరుండి మరీ చూపిస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. దానికి అచ్చమైన ఉదాహరణ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన తన కుటుంబంలో తాతయ్య హోదాలో ఉన్నారు.

మనవడి చెంతన….

జనతా కర్ఫ్యూ వేళ జనమంతా ఇంట్లో ఉంటే సెలిబ్రిటీలు కూడా తప్పనిసరిగా తామున్న చోట ఉండాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ముమ్మారు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కూడా ఇంటిలో ఉంటూ తన మనవడుతో చాలా సేపు గడిపారు. నిజంగా చంద్రబాబు లాంటి వారికి ఇది చాలా ఆహ్లాదాన్ని ఇచ్చే పరిణామంగా చూడాలి. చంద్రబాబు బిజీ పొలిటీషియన్. ఆయన తెల్లారి లేస్తే రాజకీయాలే మాట్లాడుతారు. యాత్రలు చేస్తారు. ఊళ్ళు పట్టుకుని తిరుగుతారు. ఈ నేపధ్యంలో బాబు విపక్షంలో ఉన్నా సరే తన వైఖరి మార్చుకోకుండా రెండు పూటలా మీడియా మీటింగులు, పార్టీ నేతలతో సమావేశాలు పెడుతూ వస్తున్నారు. అలాంటి చంద్రబాబు కరోనా నేపధ్యంలో ఇంటికి పరిమితమై మనవడికి పాఠాలు చెబుతున్న సీన్ చూసిన వారు ఇది కదా బాబు చేయాల్సింది. ఇది కదా మనవడికి తాతతో కావాల్సింది అనిపించకమానదు.

పెరిగిన గౌరవం….

చంద్రబాబుకు ఎన్ని పదవులు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా కూడా ఆయన తన మనవడికి పాఠాలు చెబుతూ పెట్టిన వీడియోకి వచ్చిన లైకుల కంటే ఎక్కువ వచ్చి ఉండవు. తాత హోదా కంటే బాబుకు మించిన గౌరవమూ ఉండదేమో. అందుకే చంద్రబాబు ఇలా తన వీడియో షేర్ చేయగానే అలా జనాల్లోకి వెళ్ళిపోయింది. శభాష్ బాబు గారు.. సరైన స్థానంలో ఉన్నారిపుడు అంటూ అంతా అభినందించారు. బాబు వంటి సీనియర్ సిటిజన్ ఈ సమయంలో చేయాల్సినది కూడా అదేనని మేధావులు కూడా అంటున్నారు.

ఫ్యామిలీకే…

జనతా కర్ఫ్యూ వల్ల కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా తెలిసివచ్చింది. అంతే కాదు, చంద్రబాబు వంటి వారు పూర్తి కాలం రాజకీయం చేస్తూ కుటుంబాలను పక్కన పెట్టామని తరచూ మీడియా సమావేశాల్లో వాపోవడమూ అంతా చూశారు. ఇపుడు తాతను మనవడిని అలా కలిపిన జనతా కర్ఫ్యూకి అభినందలనే చెప్పాలి. అంతే కాదు, ఏ వయసుకు ఆ విలువ అన్నట్లుగా బాబుని, ఆయన వయసుని చూడకుండా తిట్టిపోసే వారు కూడా మనవడితో ఆయన ఉన్న వీడియోను చూసి అయినా ఇక మీదటా జాగ్రత్తగా మాట్లాడతారు. అలా అని చంద్రబాబు పూర్తిగా కుటుంబానికి అంకితం అయి రాజకీయాలు వదిలిపెట్టమని కాదు, బాబు వంటి వారు తమ కుటుంబ హోదాలకూ ఎక్కువ విలువ ఇస్తూ తమ అసలైన పాత్రను తెలుసుకుంటే జనాల నుంచి మాజీ ముఖ్యమంత్రి గౌరవం కంటే రెట్టింపు గౌరవం లభిస్తుంది అన్నదే అందరి మాట.

Tags:    

Similar News