తమ్ముళ్లూ అంటూనే కొంపముంచేస్తున్నారుగా

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆ పార్టీకి గుణ‌పాఠం నేర్పుతున్నాయా? ఆ పార్టీ స‌మీక్ష చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడుతోందా? ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన అన్నద‌మ్ముల‌కు [more]

Update: 2020-03-23 15:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆ పార్టీకి గుణ‌పాఠం నేర్పుతున్నాయా? ఆ పార్టీ స‌మీక్ష చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్పడుతోందా? ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన అన్నద‌మ్ముల‌కు చంద్రబాబు త‌న పార్టీలో ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛ.. ఇప్పుడు ఆయ‌న‌కు, ఆయ‌న పార్టీకి సంక‌టంగా మారి పోయిందా? అంటే తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్నవారు. ఔన‌నే అంటున్నారు. విష‌యం లోకి వెళ్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో ఒకే కుటుంబం నుంచి వ‌చ్చిన అన్నద‌మ్ములు టీడీపీలో ఉన్నారు. అయితే, వారి వ‌ల్ల పార్టీ మ‌రింత‌గా అభివృద్ధి చెందుతుంద‌ని చంద్రబాబు భావించారు.

విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చినా…

ఈ క్రమంలోనే వారు కోరిన మేర‌కు చంద్రబాబు హ‌ద్దులు మీరిన స్వేచ్ఛ ఇచ్చార‌నేది వాస్తవం. ఇలా కొన్ని జిల్లాల్లో అన్నద‌మ్ములు పార్టీలో చ‌క్రం తిప్పుతున్నారు. వీరివ‌ల్ల పార్టీ నిజంగానే డెవ‌ల‌ప్ అయిందా ? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. అదేస‌మ‌యంలో వీరివ‌ల్ల పార్టీ నాశ‌నం అయిందా ? అంటే ఔన‌నే స‌మాధానం. వెర‌సి టీడీపీలో అన్నద‌మ్ముల రాజకీయం హాట్ హాట్‌గా మారింది. అదేంటో కొన్ని ఉదాహ‌రణ‌లు చూద్దాం. మ‌రి ఇప్పటికైనా చంద్ర‌బాబు ఈ ప‌రిణామాల‌ను స‌రిదిద్దుతారో.. లేక చూస్తూ ఊరుకుంటారో ? చూడాలి.

కృష్ణుడు-రామ‌కృష్ణుడు : తూర్పుగోదావ‌రి జిల్లాలో చ‌క్రం తిప్పుతున్న య‌న‌మ‌ల సోద‌రులు వీరే. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఎమ్మెల్యేగా, మాజీ స్పీక‌ర్‌గా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక‌, కృష్ణుడు ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే టీడీపీ ఈ జిల్లాలో ప్రస్తుతం ఇక్కట్లో ఉన్నా.. ఈ ఇద్దరు అన్నద‌మ్ములు పార్టీ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం ఒక్క‌టంటే ఒక్క‌టి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, చంద్ర‌బాబు వీరికి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చారు. తుని నియోజ‌క‌వ‌ర్గం స‌హా జిల్లాపై ప‌ట్టు పెంచుకుని ఆధిప‌త్యం చేసిన స‌మ‌యంలోను, అధికారుల‌పై ఆధిప‌త్యం చ‌లాయించిన‌ప్పుడు కూడా చంద్రబాబు చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేశారు. ఇప్పుడు పార్టీ ప‌ట్టుతున్నా.. ఈ అన్నద‌మ్ములు నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరివ‌ల్ల పార్టీకి ఒరిగింది ఏంటి ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దివాక‌ర్‌-ప్రభాక‌ర్‌: అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ సోద‌రులు వీరే. గ‌తంలో కాంగ్రెస్‌లోను, 2014 నుంచి టీడీపీలో ను ఉన్నారు. జిల్లాపై వీరి ఆధిప‌త్యం ఎక్కువ‌గానే ఉంది. ఫ‌లితంగా టీడీపీ బ‌లోపేతం అవుతుంద‌ని భావించిన చంద్రబాబు వీరికి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చారు. అయితే, ఈ స్వేచ్ఛ వారు త‌మ స్వలాభానికి వాడుకున్నంతగా పార్టీకోసం ఎక్కడా వినియోగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా వీరి కార‌ణంగా పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు ఆధిప‌త్య ధోర‌ణులు పెరిగి..అంతిమంగా పార్టీ న‌ష్టపోయే ప‌రిస్థితి వ‌చ్చిం ది. అంతేకాదు, పార్టీ నుంచి సీనియ‌ర్ నాయ‌కులు, కీల‌క నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చి వేరే పార్టీల్లో చేరే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అయినా .. చంద్రబాబు మాత్రం వీరి విష‌యంలో ఇప్పటికీ ఉదాశీనంగానే ఉన్నార‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ర‌విచంద్ర-మ‌స్తాన్‌రావు: నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోద‌రులుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. వీరికి కూడా చంద్రబాబు భారీ ప్రియార్టీ ఇచ్చారు. నెల్లూరులోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరికి ఎదురు లేద‌నేది వాస్తవం. అంతా వారిక‌నుస‌న్నల్లోనే కార్యక్రమాలు సాగాయి. అయితే, మ‌రి వీరి ఐక్యత పార్టీని త‌మ‌కోసం వాడుకునేందుకు మాత్రమే ప‌నిచేసింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీని నిల‌బెట్టే ప్రక్రియ‌ను ఈ నాయ‌కులు చేప‌ట్టలేదు. పైగా ర‌విచంద్ర జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. ఇక‌, ఇటీవ‌ల మ‌స్తాన్‌రావు.. చంద్రబాబుకు హ్యాండిచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు ఇక్కడ ఎలాంటి చ‌ర్యలూ చేప‌ట్టక‌పోవ‌డంతో టీడీపీ పూర్తిగా డీలాప‌డుతోంద‌నే భావన వ్య‌క్త‌మ‌వుతోంది.

కృష్ణమూర్తి-ప్రభాక‌ర్‌: క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో కేఈ సోద‌రులుగా ముద్ర ప‌డిన వీరు టీడీపీలో మూడు ద‌శాబ్దాల‌కు పైగానే రాజ‌కీయ చ‌క్రం తిప్పారు. అయితే, వీరు కూడా పార్టీకి చేసింది ఏమీలేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీని అన్ని విధాలా వాడుకున్నార‌ని, త‌మ‌కు ప‌ద‌వులు, త‌మ బిడ్డల‌కు టికెట్ల కోస‌మే వాడుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మిగిలిన వారికి మాదిరిగానే చంద్రబాబు వీరికి కూడా భారీ స్వేచ్ఛను ఇచ్చారు. అయితే, వీరు ఈ స్వేచ్ఛను పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డం కోసం కాకుండా త‌మ స్వప్రయోజ‌నాల కోసం వాడుకున్నారు. గ‌త ప్రభుత్వంలో కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రభాక‌ర్ ఎమ్మెల్సీ అయ్యారు. అయితే, ఇప్పుడు పార్టీ క‌ష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో కృష్ణమూర్తి రాజ‌కీయ స‌న్యాసం చేయ‌డం, ప్రభాక‌ర్ ఏకంగా పార్టీ మారిపోవ‌డం వంటి ప‌రిణామాలు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చకు వ‌స్తున్నాయి. మ‌రి ఇలాంటి సోద‌రుల‌కు స్వేచ్ఛనిచ్చి చంద్రబాబు సాధించిందేంట‌నే ప్రశ్న ఉత్పన్నమ‌వుతోంది. మ‌రి ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి ప‌రిణామాల‌పై స‌మీక్ష చేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News