బాబయ్యా…. అప్పుడలా… ఎందుకు ఇలా?

చంద్రబాబుకు రాజ్యాంగం మీద గౌరవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు ఏ రాజ్యంగం గుర్తుకు రాదు. ఎన్నికల కమిషన్ కూడా తన తర్వాతేనంటారు. [more]

Update: 2020-03-25 17:30 GMT

చంద్రబాబుకు రాజ్యాంగం మీద గౌరవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు ఏ రాజ్యంగం గుర్తుకు రాదు. ఎన్నికల కమిషన్ కూడా తన తర్వాతేనంటారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ అధికారాలు, సెక్షన్లు, రాజ్యాంగంలో పేజీలతో సహా ఆయన గడగడా చెప్పేస్తారు. అయితే చంద్రబాబు పాత క్లిప్లింగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గవర్నర్ వ్యవస్థను…..

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అవసరం లేదన్నారు. అప్పటి గవర్నర్ నరసింహన్ మీద చిందులు తొక్కారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటుగా మారారని ఆరోపించారు. తొలి నుంచి టీడీపీ గవర్నర్ వ్యవస్థలను వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు. నల్ల చొక్కాలతో నిరసనలు కూడా తెలిపారు. అదే గవర్నర్ ను ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. పదే పదే ఆయన వద్దకు పరుగులు తీస్తున్నారు.

ఎన్నికల సంఘంపై….

ఇక 2019 ఎన్నికల సమయంలో అప్పడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై మండి పడ్డారు. తర్వాత సీఎస్ ను కూడా బదిలీ చేయడంతో ఇక ఆయన నిప్పులే చెరిగారు. ఢిల్లీ వెళ్లి అఖిలపక్ష నేతలతో కలసి కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ఇక స్థానిక ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది కొందరు పోలీసు అధికారులను బదిలీ చేయడంతో ఆయనపై బాహాటంగానే నిప్పులు చెరిగారు. మీకేం అధికారముందని ప్రశ్నించారు.

చీఫ్ సెక్రటరీ విషయంలో….

ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన మాట వినాల్సిందేనని చెప్పారు. కొన్ని ఫైళ్లను క్లియర్ చేయాలని వత్తిడి తెచ్చారు. కానీ జగన్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినప్పుడు ఆయనను ఎలా బదిలీ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా అధికారులపై అన్ని రకాల వత్తిడి తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారని సోషల్ మీడియా అప్పటి, ఇప్పటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఎంత ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించారో అందరికీ తెలుసునన్న సెటైర్లు విన్పిస్తున్నాయి. అధికారంలో లేకుంటేనే రాజ్యాంగ వ్యవస్థలపై చంద్రబాబుకు నమ్మకం ఉంటుందని, లేకుంటే ఆయన వాటిని లెక్క కూడా చేయరన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News