అన్నీ తప్పుడు నిర్ణయాలేనా? రివర్స్ ఎందుకు కొడుతున్నాయ్?

టీడీపీ అధినేత చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఏమైంది? తన వాళ్లెవరో? తనకు నమ్మకంగా ఉండేవాళ్లు ఎవరో ఆయన తెలుసుకోలేక పోయారా? అధికార మైకంలో పడిపోయి [more]

Update: 2020-03-13 11:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఏమైంది? తన వాళ్లెవరో? తనకు నమ్మకంగా ఉండేవాళ్లు ఎవరో ఆయన తెలుసుకోలేక పోయారా? అధికార మైకంలో పడిపోయి అనర్హులకు పదవులు ఇచ్చారన్న విమర్శను చంద్రబాబు సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అందులో ఏదో ఒక ప్రయోజనం చూసుకుని ఇస్తారు. అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు వేసుకుని మరీ అందలం ఎక్కించిన నేతలందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండటం చంద్రబాబు సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని బయటపెట్టిందన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.

రాజ్యసభ సభ్యుల నుంచే…

రాజ్యసభ సభ్యుల నుంచే ఇదే మొదలయిందని చెప్పాలి. పార్టీ మారి వచ్చిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావులకు రాజ్యసభ పదవులిస్తే వారు వెళ్లిపోయారు. సరే ఇది చంద్రబాబుకు తెలిసే జరిగిందన్న ఒక కోణంలో కామెంట్స్ వినిపిస్తున్నాయనుకోండి. మరి ఎమ్మెల్సీలకు ఏమైంది. చంద్రబాబు నిర్ణయాలను తప్పుడు నిర్ణయాలని తేలిపోతున్నాయా? ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు. డొక్కాకు పార్టీ మారి వచ్చినా ఎమ్మెల్సీ ఇచ్చారు.

వెళ్లిన వాళ్లందరూ…

ఇక పోతుల సునీత పరిస్థితి అంతే. ఆమెను నమ్మి మరీ చీరాలకు పంపారు చంద్రబాబు. అయితే పోతుల సునీత పార్టీ మారడం అక్కడ కరణం బలరాంకు టిక్కెట్ ఇవ్వడమేనంటున్నారు. పోనీ గత కొన్ని సార్లుగా గెలవలేని కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చీరాల టిక్కెట్ ను కూడా ఇచ్చారు. అయినా కరణం బలరాం టీడీపీకి దూరమయ్యారు. సీనియర్ నేత అన్న గౌరవంతోనే చంద్రబాబు కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు.

నమ్మకమైన నేతలని……

ఇక ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనాధ్ రెడ్డి కూడా పార్టీకి దూరమయ్యారు. తాజాగా కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలులో అంత మంది నేతలున్నా చంద్రబాబు కేఈ కుటుంబానికి గౌరవమిచ్చి ప్రభాకర్ ను ఎమ్మెల్సీ చేశారు. అయినా కేఈ ప్రభాకర్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరో ఎమ్మెల్సీ శమంతకమణి కూడా అదే బాటలో ఉన్నారు. వీరంతా ఎమ్మెల్సీలే కావడం విశేషం. ఎన్నికల్లో గెలవలేకపోవడం, పార్టీకి నమ్మకంగా ఉంటారన్న కారణంతోనే వీరికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. దీంతో పదవుల పంపకాల్లో చంద్రబాబు నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News