చంద్రబాబును ముంచేది ఆయనేనా?

చంద్రబాబుకు తెలివితేటలు ఎక్కువే. ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. కానీ చంద్రబాబు కూడా మనిషే. ఆయనకూ పేరాశలు, పెద్దాశలు ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని సీనియర్ నేత [more]

Update: 2020-03-16 11:00 GMT

చంద్రబాబుకు తెలివితేటలు ఎక్కువే. ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. కానీ చంద్రబాబు కూడా మనిషే. ఆయనకూ పేరాశలు, పెద్దాశలు ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి మంచి కబుర్లు చెబుతూ ముంచేస్తున్నారా అన్న డౌట్లు తమ్ముళ్ళకే వస్తున్నాయిట. లేకపోతే ఒక వైపు వరసగా పార్టీ నాయకులంతా క్యూ కట్టి మరీ వైసీపీ వైపు వెళ్ళిపోతున్నారు. పార్టీలో ఫైటింగ్ స్పిరిట్ ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు. బాబు రొటీన్ స్పీచులు తప్ప ఎక్కడా కొత్తదనం లేని పార్టీకి మంచి రోజులు ఇపుడే అనుకోవడం తొందరపాటే అవుతుంది. కానీ అంతా బాగుంది అంటూ జేసీ లాంటి వారు చంద్రబాబును ఉబ్బేస్తున్నారు.

బాబే సీఎం అట….

చంద్రబాబు ఇప్పటికి ముమ్మారు సీఎం గా పనిచేశారు. ఆయన రెండోసారి, , మూడోసారి సీఎం అయిన రాజకీయ పరిస్థితులు వేరు. ఇపుడు నాలుగవ సారి సీఎం కావాలంటే చాలానే చేయాలి. పైగా 2024 అంటే నాలుగేళ్ళకు పైగా సమయం ఉంది. కానీ జేసీ దివాకరరెడ్డి వంటి వారు మాత్రం 2024లో మీరే సీఎం ఇప్పుడు హాయిగా నిద్రపొండి అంటూ జో కొడుతున్నారు. మీరు తప్ప అప్పటికి ఏపీకి వేరే దిక్కు ఉండదు, జనాలు మిమ్మల్నే కోరుకుంటారు అంటూ బాగానే ఆశపెడుతున్నారు. ఇదే జేసీ 2019లో ఎన్నికలు అయిపోయి ఫలితాలు ఇంకా వెలువడక ముందు చంద్రబాబుతో మళ్ళీ టీడీపీయే వస్తుందని జోస్యాలు చెప్పాడు. పసుపు కుంకుమ పధకం బాగా పనిచేసింది, మహిళలు అంతా మనకే ఓటేశారని కూడా బోలేడు కధలు చెప్పాడు.

ముందస్తు అన్నారుగా…..

ఇక ఎన్నికలు అయిపోయాక మోడీ మహిమతోనే జగన్ సీఎం సీట్లో కూర్చున్నారని జగన్ గెలుపుని తక్కువ చేసి చంద్రబాబు బలాన్ని రెట్టింపుగా చూపెట్టిందీ ఇదే జేసీ. అంతటితో ఆగకుండా మోడీ ఎపుడు స్విచ్ ఆఫ్ చేస్తే అపుడు ఇక్కడ జగన్ కుర్చీ కదిలిపోతుందని కూడా వల్లించారు. అలగే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మరో రెండేళ్ళల్లో మన బాబే మళ్ళీ సీఎం అంటూ తొలినాళ్ళలో బాబుతో సహా అందరినీ మభ్యపెట్టేలా ప్రకటనలూ చేశారు. ఇపుడు మాత్రం 2024 దాకా ఎన్నికలను తీసుకుపోయిన జేసీ అపుడు బాబే సీఎం కానీ గెలిచినా చంద్రబాబు ఏమీ చేయలేరని, అప్పటికి ఏపీని జగన్ సర్వనాశనం చేసేస్తాడని మరో జోస్యం వదిలారు.

అర్ధం అవుతోందా….?

నిజానికి జేసీకి ఇపుడున్న రాజకీయం అర్ధమవుతోందా అని తమ్ముళ్ళే ప్రశ్నిస్తున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తన అహంకారంతో అనంతపురం జిల్లాలో టీడీపీని పడకేయించిన జేసీ తాపీగా సుద్దులు చెబుతున్నారని పసుపు శిబిరంలో విమర్శలూ ఉన్నాయి. చంద్రబాబుని పొగుడుతున్నట్లే తిడుతూ జేసీ పెద్దాయన పరువు తీసేలా స్టేట్మెంట్లు ఇవ్వడంతో కూడా దిట్ట అంటున్నారు. బాబు చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు వింటున్నారని పదే పదే అనడం ద్వారా స్వతహాగా ఆయన ఆలోచించరన్న దాన్ని జనంలోకి పంపించిన జేసీ ఇపుడు తన మాటే చంద్రబాబు వినాలని ఎలా కోరుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు. బాబుకే కాదు మొత్తం టీడీపీకి పొలిటికల్ సీన్ అర్ధమ‌వుతోంది, జేసీకే అర్ధం కాక తికమక మాటలతో మరింత గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో జేసీ పొలిటికల్ జోకర్ గా మిగిలిపోతున్నారని, చంద్రబాబు సైతం ఆయన మాటలు నమ్మితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News