ఇంక మేమెందుకు బాబూ..వారికే ఇచ్చుకో?

కార్యకర్తలకే పెద్ద పీట వేశామంటారు. కార్యకర్తలే మా ప్రాణం అంటారు. వారు లేనిదే పార్టీ లేదంటారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలు గుర్తుకు రారు. అధికారంలో లేకున్నా అంతే. [more]

Update: 2020-03-19 11:00 GMT

కార్యకర్తలకే పెద్ద పీట వేశామంటారు. కార్యకర్తలే మా ప్రాణం అంటారు. వారు లేనిదే పార్టీ లేదంటారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలు గుర్తుకు రారు. అధికారంలో లేకున్నా అంతే. ఎన్నికల సమయంలోనూ అంతే. పార్టీలో అన్నీ అనుభవించిన నేతలు మాత్రం పార్టీని వీడి వెళుతుంటారు. కార్యకర్తలు మాత్రం నిత్యం జెండాను మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న చర్చ ఇదే. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం వారసులకే టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు.

అనేకమంది నేతలున్నా…..

నిజానికి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అనేక మంది నేతలు ఉన్నారు. పార్టీ కార్పొరేటర్లు వారు అనేక సార్లు విజయం సాధించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నగర పాలకసంస్థలో ప్రధాన భూమిక పోషించారు. వీరంతా పార్టీ కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్ గా ఎదిగిన వారు ఉన్నారు. వీరిలో మహిళ కార్పొరేటర్లు కూడా యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలను భరించే శక్తి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కు లేకపోవడంతో వారసులను రంగంలోకి దించుతున్నారు.

శ్వేత పేరును ఖరారు చేయడంతో….

విజయవాడ టీడీపీ మేయర్ గా కేశినేని నాని రెండో కూతురు శ్వేత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిందంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల ఖర్చే. కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించింది. వంశీ టీడీపీని వీడి వెళ్లిపోయారు. అయితే ఎంపీగా గెలిచిన నానిపై కార్పొరేషన్ ఎన్నికల భారం మోపేందుకు పార్టీ రెడీ అయింది. అందుకోసమే కేశినేని నాని కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారంటున్నారు.

వారసులకు తప్ప ఇంకెవ్వరికీ….

శ్వేత ఇప్పటికే విజయవాడ పదో డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. అయితే దీనిపై టీడీపీ నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఆమెను హడావిడిగా దిగుబడి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తాము పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన విషయాన్ని అధిష్టానం ఎందుకు గుర్తించలేకపోతుందంటున్నారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులున్నందునే శ్వేతను దించాల్సి వచ్చిందని అధిష్టానం బెజవాడ టీడీపీ అభ్యర్థులకు నచ్చ చెబుతోంది. మొత్తం మీద శ్వేత ఎంపిక పై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News