కరకట్టపై ఆ సీన్ లేదెందుకనో?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకనాడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. అంతెందుకు 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆయన ప్రభ హస్తినలో మామూలుగా ఉండేది కాదు. జాతీయ [more]

Update: 2019-09-29 15:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకనాడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. అంతెందుకు 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆయన ప్రభ హస్తినలో మామూలుగా ఉండేది కాదు. జాతీయ మీడియా సయితం ఆయన పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. ఇక మొన్నటి ఎన్నికల వరకూ ఆయన హవా హస్తినలో అలాగే కొనసాగింది. ప్రధానంగా మోదీతో, బీజేపీతో వైరం పెట్టుకున్న తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటకు ఎన్నికల ముందు వరకూ ప్రయత్నించారు. అందరు నేతలతో చర్చలు జరిపారు.

కూటమి కట్టేందుకు…

ఎన్నికలకు ముందు కూటమి వర్క్ అవుట్ కాకపోవడంతో ఫలితాల తర్వాత కూటమి కడదామని చంద్రబాబు సర్దిచెప్పుకొచ్చారు. అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కూటమి ఆలోచనకు బీజం పడింది. సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కావడంతో దేశమంతా పొత్తులతో వెళ్లాలని చంద్రబాబు భావించారు. అయితే ప్రతి రాష్ట్రంలో అక్కడి ప్రాంతీయ పార్టీలు ససేమిరా అనడంతో అది సాధ్యం కాలేదు. మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలతో చంద్రబాబు తరచూ భేటీ అయ్యేవారు. పశ్చిమ బెంగాల్ లో సీబీఐ దాడులకు నిరసనగా అక్కడకు వెళ్లి మమతకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు.

కష్టాల్లో ఉన్నా….

కట్ చేస్తే… ఇప్పుడు చంద్రబాబు తో కలసి వచ్చే జాతీయ స్థాయి నేతలు చాలా మందే ఉన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కష్టాల్లో ఉంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు పూర్తిగా హస్తిన వైపు వెళ్లడం మానేశారు. విజయం సాధించలేకపోవడంతో జాతీయ స్థాయి నేతలకు మొహం చూపించలేకపోతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇటీవల చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబును ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది.

పరామర్శ షో….

మామూలుగా అయితే చంద్రబాబు ఇంటికి జాతీయ నేతలు క్యూ కట్టేవారు. ఇందుకు బాబు వద్ద ఒక టీం ఉంటుంది. రోజుకొక జాతీయ నేతను ఇంటికి తీసుకువచ్చి చంద్రబాబును పరామర్శ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లు కరకట్టమీద కనపడటం లేదు. ఎందుకంటే ఒకవైపు జగన్ తనను ఇబ్బంది పెడుతుంటే విపక్షనేతలను తాను తీసుకువస్తే మోదీ నుంచి కూడా ముప్పు ఏర్పడుతుందని చంద్రబాబు భయం కావచ్చు. అందుకే తనకు అత్యంత సన్నిహితులైన జాతీయ నేతలుకూడా అమరావతి వస్తామన్నా చంద్రబాబు వద్దు ప్లీజ్ అని అంటున్నారట. లేకుంటే ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబుకు పరామర్శల వెల్లువ ఉండేది. మోదీ వల్లనే ఆ తాకిడి లేదంటున్నారు.

Tags:    

Similar News