డెమో క్లిక్ కావడంతో… చంద్రబాబు మరోసారి?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అనుకున్నది సాధిస్తారు. పార్టీ పుంజుకునేందుకు, తనంటే నేతల్లో నమ్మకం కల్గించేందుకు చంద్రబాబు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ అవకాశాన్ని [more]

Update: 2020-02-29 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అనుకున్నది సాధిస్తారు. పార్టీ పుంజుకునేందుకు, తనంటే నేతల్లో నమ్మకం కల్గించేందుకు చంద్రబాబు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ అవకాశాన్ని ఆయన వదలిపెట్టరు. తనకు అనుకూలంగా మలుచుకునే విషయంలో దిట్ట. అందుకే నలభై ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో సక్సెస్ లు ఎక్కువనే చెప్పాలి. ప్రధానంగా సంక్షోభ సమయంలోనే సమయానుకూలంగా నడుచుకుంటారు చంద్రబాబు. ఇప్పుడు విశాఖ పర్యటన కూడా ఆయన ఊహించిందేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ట్రాప్ లో పడిపోయి…..

చంద్రబాబు అనేక ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ పర్యటనలకు ముందు ఆయన పెద్దగా ఏమీ మాట్లాడలేదు. కానీ విశాఖ పర్యటన గురించి కుప్పంలోనే చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేతల గుట్టును విశాఖలోనే విప్పుతానని కుప్పంలోనే ప్రకటించారు. అలాగే విశాఖ వెళ్లే ముందు రోజు వరకూ ఆయన అదేరకమైన ప్రకటనలు చేస్తూ వైసీపీ నేతలను తన ట్రాప్ లోకి లాగేసుకున్నారు. చంద్రబాబు మాటలు విని రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఆయనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.

ఊహించని రీతిలో….

చంద్రబాబు ఊహించిన రీతిలోనే ప్లాన్ సక్సెస్ అయిందంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతల. 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతను నాలుగు గంటల పాటు తిండి, నీరు లేకుండా రోడ్డు మీద నిలిపేయడంతో సానుభూతి వచ్చిందంటున్నారు. అలాగే వైసీపీ నేతల అరాచకాలను డెమో రూపంలో విశాఖ ప్రజలకు చూపించాలనుకున్న చంద్రబాబు ప్లాన్ కూడా క్లిక్ అయిందంటున్నారు. ఊహించని విధంగా విశాఖ ఎయిర్ పోర్టు ఘటన తమకే కలసి వచ్చిందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.

నిస్తేజంలో ఉన్న సమయంలో…..

పార్టీ నిస్తేజంలో ఉన్న సమయంలో విశాఖ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళనకు దిగాయి. ఇది ఒకరకంగా పార్టీలో జోష్ రావడానికి కూడా కారణమయిందంటున్నారు. ఇలా విశాఖ ఎయిర్ పోర్టు ఘటన చంద్రబాబుకు అన్ని రకాలుగా లాభదాయకమేనని, విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అరాచక డెమోను చూసి విశాఖ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే వారంలోనే చంద్రబాబు విశాఖలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తం మీద డెమో క్లిక్ అవ్వడంతో చంద్రబాబు ఇక వైసీపీ నేతలను రెచ్చగొట్టి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లుంది.

Tags:    

Similar News