జారుడు మెట్లలో పాదాలు తడబడుతున్నాయా?

పతనం అంటే ఇలాగే ఉంటుందా? జారుడు మెట్లలో పాదాలు తడబడుతూంటే తప్ప తత్వం బోధపడదా. టీడీపీ చరిత్రలో మరో ఘోర పరాభవం. అది కూడా అధినాయకులకే. ఒకనాడు [more]

Update: 2020-02-28 06:30 GMT

పతనం అంటే ఇలాగే ఉంటుందా? జారుడు మెట్లలో పాదాలు తడబడుతూంటే తప్ప తత్వం బోధపడదా. టీడీపీ చరిత్రలో మరో ఘోర పరాభవం. అది కూడా అధినాయకులకే. ఒకనాడు పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావుకు వైస్రాయి హొటల్ వద్ద చెప్పులతో దాడి జరిగింది. రామారావు ఆనాడే చనిపోయాడని ప్రకటించుకున్నాడు పెద్దాయన. ఆయన అభిమానధనుడు కాబట్టి అలా మధనపడిపోయాడు, కుమిలిపోయాడు, చివరికి తనువే చాలించాడు. సరిగ్గా పాతికేళ్ళ తరువాత అల్లుడు, అదీ పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు కూడా వరసగా చెప్పులతో దాడులు జరుగుతున్నాయి. అది నిన్న అమరావతి, నేడు విశాఖపట్నం. పార్టీకి పెద్ద దిక్కు మీదనే ఇంతటి దారుణం జరుగుతుంటే ఇక క్యాడర్ కి ఏం ధైర్యం ఉంటుంది. వారిలో నైతిక స్థైర్యం ఎక్కడ నుంచి వస్తుంది.

బేలగా బాబు….

చంద్రబాబులో ఏనాడూ చూడని బేలతనం చూసిన వారికి జాలి కలుగుతోంది. ఆయన ఎన్ని రాజకీయ దిగజారుడు పనులు అయినా చేసి ఉండొచ్చు కానీ. పెద్దయన‌గా ఏపీకి ఉన్నారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఉన్నారు. అటువంటి పెద్ద మనిషి మీద చెప్పులతో దాడులు, కారు మీద కోడి గుడ్లతో దాడులు, ఆఖరుకు వాటర్ బాటిల్స్ సైతం విసిరేసి చీ కొడుతున్న వైనాలు చూసిన వారికి చంద్రబాబు రాజకీయం ఎంతగా పతనావస్థకు చేరుకుంది అనిపించకమానదు. నిజమే చంద్రబాబుకు ఇపుడు అంతా కాని కాలమే. ఆయన ఏది పట్టుకుంటే అది మాడి మసి అయిపోతోంది. దానికి ఉదాహరణే విశాఖ ఘటన.

చెప్పుకుంటే మాత్రం…..

తాను నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వాడినని చంద్రబాబు చెప్పుకుంటూంటే ఆయన అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. తాను పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానని, పదకొండేళ్ళు ప్రతిపక్ష నేతను అని, పాతికేళ్ళకు పైగా ఒక పెద్ద పార్టీకి అధినాయకుడిని అని చంద్రబాబు మీడియా ముందు వల్లిస్తూంటే వినేవారికి కూడా ఎందుకీ పెద్దాయనకు ఇన్ని కష్టాలు అనిపించకమానదు. తాపీగా ఇంట్లో కూర్చోక ఈ పోరాటాలు ఎందుకు అని కూడా అనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ కధ ముగింపునకు వచ్చింది అని కూడా బోధపడుతుంది. అవును మరి రాజకీయం మారిపోయింది. చంద్రబాబు చేతుల్లో నుంచి అది జారిపోయింది.

పట్టు జారిందా…?

బాబు లాంటి వారినే కట్టడి చేస్తే ఇక టీడీపీకి పుట్టగతులు ఉంటాయా. బాబే చెప్పుకున్నట్లుగా తనలాంటి వారినే కదలకుండా చేస్తే ఇక ఏం జరుగుతుందో అన్నది జనాన్ని చూసి ఆయన ఆవేదన కాదు, జనానికిపోయేది లేదుగా, ఎవరో ఒకరు రాజకీయం చేస్తారు. కానీ టీడీపీకే ఆ బాధా, ఆవేదన మిగులుతుంది. టీడీపీలో చంద్రబాబునే పద్మవ్యూహంలో బంధించేస్తున్నారు. అది బాబుకు కూడా అర్ధమైపోతోంది. ఆయన చూసిన సీఎంల కన్నా జగన్ గట్టివాడని కూడా అర్ధమవుతోంది. ఎదిరించే ఓపిక, వయసు కూడా తగ్గిపోయి పట్టు జారుతోందని తెలిసిపోతోంది. టీడీపీ అంటే బాబే. మరి చంద్రబాబునే అడ్డుకుంటే టీడీపీ పతనం మొదలైపోయినట్లేగా.

Tags:    

Similar News