అమరావతి అనిపించకుండా కదలేట్లు లేరే?

చంద్రబాబుకు తన మీద కంటే జనాల మీదనే చాలా నమ్మకం. పైగా జనం మంచితనం మీద ఇంకా నమ్మకం. అందుకే ఆయన విశాఖ రాజధానిగా వద్దు, అసలు [more]

Update: 2020-02-27 05:00 GMT

చంద్రబాబుకు తన మీద కంటే జనాల మీదనే చాలా నమ్మకం. పైగా జనం మంచితనం మీద ఇంకా నమ్మకం. అందుకే ఆయన విశాఖ రాజధానిగా వద్దు, అసలు పనికిరాదు అంటూ ఒకటికి వందసార్లు అవమానించి మరీ ఈ ప్రాంతానికి వస్తున్నారంటేనే ఆయన లెక్కలే వేరు అని చెప్పి తీరాలి. చంద్రబాబుకు ఉత్తారాంధ్ర ప్రజల గురించి తెలుసు. ఆయన పదే పదే అంటూంటారు ఈ ప్రాంత ప్రజలు మంచి వారు అని. ఆ ధైర్యమే ఆయన్ని ఉత్తరాంధ్ర టూర్ చేయిస్తోంది. నిజానికి విశాఖవాసులు మంచోళ్ళు. అటువంటి విశాఖ వాసులు ఎపుడూ ఎవరినీ ఏమీ అనలేదు. తమకు తీరని అన్యాయం జరిగినా కిక్కురుమ‌నని ఉత్త మంచివాళ్ళు. అందుకే చంద్రబాబు వారిని నమ్ముకునే తన రాజకీయానికి పదునుపెడుతున్నారు.

వద్దు అనిపించాలనే….

విశాఖకు రాజధాని ఎందుకు అసలు. ఇది చంద్రబాబు గారి ప్రశ్న. నిజమే విశాఖకు మామూలుగా అయితే రాజధాని అవసరం లేదు. కానీ కోరకుండానే జగన్ ప్రకటించారు. అపుడు కూడా వద్దు అంటే విశాఖ వాసుల కంటే అమాయకులు ఎవరూ ఉండరు, అసలు వారిని ఎవరూ అభివృధ్ధి గురించి అసలు అడగరు కూడా. కానీ చంద్రబాబుకు కావాల్సింది వేరు. ఆయన పంతం, పట్టుదలా అమరావతి ఏకైక రాజధాని కావాలన్నదే. అందుకే ఆయన విశాఖవాసులు ఎపుడు రాజధాని కోరుకున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. విశాఖ నడిబొడ్డునే ఆయన ఆ విషయం కూడా కడు ధైర్యంగా చెబుతారు. తన అనుకూల మీడియాలో ఫ్రంట్ పేజిలో దాన్ని బ్యానర్ చేసి మరీ రాయించుకుంటారు.

ఆయన మరీనూ….

చంద్రబాబు విశాఖ టూర్ కు వస్తే ఈ ప్రాంత ప్రజలు ఎదిరించాలట. ఇది మంత్రి బొత్స సత్యానారాయణ గారి అమాయకత్వం అనుకోవాలో, రాజకీయ ఆదుర్దా అనుకోవాలో అర్ధం కావడంలేదు. విశాఖ వాసులు ఎపుడైనా ఎవరిని అయినా ఎదిరించారా? తమకు ఎంతటి అన్యాయం జరిగినా వారు ఎలుగెత్తి చాటారా? విశాఖలో మొదటి మంత్రివర్గం మీటింగు పెట్టుకుంటాం, విభజన తరువాత ఇంతకంటే పెద్ద సిటీ ఏపీలో ఎక్కడా లేదు కూడా అని ఆనాడు ఇదే చంద్రబాబు అంటే రాజధాని ఇక్కడే పెడతారు అని అనుకున్నారు. ఆ తరువాత అమరావతే మన రాజధాని అని చెప్పినా ఈ ప్రాంతం నోళ్ళు లేవలేదు. పైగా పేరుకు అమరావతి రాజధాని అయినా విశాఖనే జాతీయ, అంతర్జాతీయ బడా పారిశ్రామిక వేత్తలకు బాబు చూపించి సదస్సులు పెట్టిన నాడు కూడా విశాఖనే రాజధాని చేస్తే పోలా అని చిన్నమెత్తు నిరసన కూడా వ్యక్తం చేయలేదు కదా. మరి ఈనాడు చంద్రబాబు వస్తే మాత్రం ఎందుకు మా రాజధాని లాగేసుకుంటారని అడగాలా.

జై అమారవతి అన్నా…?

ఇక చంద్రబాబు ఈ ప్రాంతం రావడం వెనక వేరే అజెండా ఉందని కూడా అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రావారికి రాజధాని అవసరం ఏముంది. వారంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. తాము ఎప్పటికీ ఇలాగే ఉంటామని అంటున్నారని లోకానికి చాటాలన్నదే చంద్రబాబు టూర్ ఆంతర్యం కదా అన్న మాట కూడా ఉంది. పైగా విశాఖలోని భూములు వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, రాజధాని వస్తే వారు ఇక్కడే తిష్ట వేసి ఇక్కడి శాంతతనుచెడగొడతారని, అందుకే రాజధాని వద్దు తమ్ముళ్ళూ అనిపించాలని కదా చంద్రబాబు అజెండా. ఇక జై అమరావతి అని చెప్పి సభ ముగించకపోతే చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ ఎలా అవుతారు. అందువల్ల బొత్స సహా వైసీపీ నేతలెవరూ ఏ రకమైన అనుమానాలు పెట్టుకోనక్కరలేదు. చంద్రబాబు టూర్ సూపర్ సక్సెస్ అవుతుంది. చంద్రబాబు విశాఖ రాజధాని వద్దు, అమరావతే ముద్దు అని జనాల చేత చెప్పించి కానీ ఇక్కడ నుంచి కదలరు కాక కదలరు. ఎనీ డౌట్స్.

Tags:    

Similar News