మాకు ఆ “బాబు” కావాలంటున్నారు…కానీ…?

నిజానికి పార్టీ అధినేతలు ఎవరూ నేతల మాటలు వినరు. తాము అనుకున్నదే చేస్తారు. సలహాలు, సూచనలు ఇచ్చే ధైర్యం కూడా ఎవరూ చేయరు. సరైన సూచనలు లేకున్నా [more]

Update: 2020-02-29 14:30 GMT

నిజానికి పార్టీ అధినేతలు ఎవరూ నేతల మాటలు వినరు. తాము అనుకున్నదే చేస్తారు. సలహాలు, సూచనలు ఇచ్చే ధైర్యం కూడా ఎవరూ చేయరు. సరైన సూచనలు లేకున్నా పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. సరైన సూచనలు, సలహాలు ఇచ్చే వారు ఆయన వద్ద లేరు. చంద్రబాబు వద్దకు వెళ్లి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కొద్దో గొప్పో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి వారు తప్ప ఆ సాహసం చేయరు. యనమల కూడా ఇప్పుడు పెద్దగా చంద్రబాబు వద్దకు వెళ్లడం లేదంటున్నారు.

ఓటమికి ప్రధాన కారణం…..

విభజిత ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇంత దారుణంగా నష్టపోవడానికి కారణం చంద్రబాబే అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. ఆయన కేవలం అధికారుల మీద ఆధారపడి పార్టీని పక్కన పెట్టేసి ప్రజలంతా తనవైపు ఉన్నారన్న భ్రమల్లో ఉన్నందునే నష్టం జరిగిందంటున్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ సయితం మరొకరిని ఆయన వద్దకు ఎంటర్ కానివ్వదు. అందుకే గత ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారు నుంచి నిధుల సమీకరణ, నిధుల పంపిణీ అంతా చంద్రబాబు కోటరీ మాత్రమే చూసుకుంది.

గతంలో సీనియర్లు….

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు సీనియర్ నేతల సూచనలు తీసుకునే వారంటున్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీలో కంటే ముందు సీనియర్ నేతలతో చర్చించేవారు. అప్పట్లో దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, మండవ వెంకటేశ్వరరావు, లాల్ జాన్ భాషా, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కోడెల శివప్రసాదరావు, బీవీ మోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష‌్ణమనాయుడు వంటి నేతల సలహాలను చంద్రబాబు తీసుకునే వారు. వారిచ్చిన సలహాలు, సూచనల్లో ఎక్కువ శాతం పరిగణనలోకి తీసుకుని అమలు పర్చేవారు.

కోటరీయే అంతా……

కాని రాష‌్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు లో మార్పు వచ్చిందంటున్నారు. చంద్రబాబు చుట్టూ కార్పొరేట్ శక్తులు, బిజినెస్ మైండ్ పీపుల్ చేరిపోవడంతో ఆలోచనలన్నీ అమరావతి దాటి రాలేకపోయాయంటున్నారు. కొందరు సీనియర్ నేతలు చెప్పాలని ప్రయత్నించినా చంద్రబాబు సమయం ఇచ్చే వారు కూడా కాదన్నది టీడీపీ నేతల నుంచి విన్పిస్తున్న ఆరోపణ. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు వెలుగువెలిగిన టీడీపీ ఇప్పుడు దాదాపు తెలంగాణలో కనుమరుగై పోయింది. ఏపీలోనూ తిరిగి పార్టీ బతికిబట్ట కట్టాలంటే చంద్రబాబు మునుపటిలా సీనియర్ల సలహాలు పాటించాల్సిందే నంటున్నారు. మరి చంద్రబాబు మునుపటిలా మారతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News