ధైర్యానికి మెచ్చుకోవాలా ?

ఈ దేశంలో ఎందరో కోర్టు మెట్లు ఎక్కారు. మహామహులు కోర్టు నుంచి తాఖీదులు అందుకున్నారు. వారిలో ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నరులు, ఎందరో ఉన్నారు. మరి ఎవరికీ లేని [more]

Update: 2020-02-26 00:30 GMT

ఈ దేశంలో ఎందరో కోర్టు మెట్లు ఎక్కారు. మహామహులు కోర్టు నుంచి తాఖీదులు అందుకున్నారు. వారిలో ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నరులు, ఎందరో ఉన్నారు. మరి ఎవరికీ లేని ధైర్యం, నమ్మకం ఒక్క చంద్రబాబు కుటుంబానికే ఉండడం విశేషం. పాలన అంటూ చేస్తే ఎక్కడో ఒక చోట తప్పులు జరగకమానవు, అందునా చంద్రబాబు మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ముమ్మారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అటువంటిది చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబు మాత్రం ఏ విచారణలైనా సిధ్ధం అంటున్నారు. మాకేం కాదని చాలా తేలికగా తీసుకుంటున్నారు.

నమ్ముతున్నారా….?

చంద్రబాబు వరకూ అయితే దీన్ని కూడా తన మీద కక్ష సాధింపు చర్యగా చిత్రీకరిస్తున్నారు. ఆయన ఇపుడు బస్సు యాత్రలో ఉన్నారు. దాంతో జనంలోకి వెళ్ళి జూనియర్ వైఎస్ తనను నానా బాధలు పెడుతున్నారని కన్నీరు పెడుతున్నారు. ఇక తాను ఏ విచారణకు భయపడేవాడిని కాదని ఆయన అంటూనే తన మీద వైఎస్సార్ అప్పట్లో ఎన్నో విచారణలు జరిపించారు, అవేమయ్యానని ప్రశ్నించారు. తాను నిప్పు అని కడిగిన ముత్యమని కూడా చంద్రబాబు గట్టిగా చెప్పుకుంటున్నారు. మరి జనం వీటిని నమ్ముతున్నారా అన్నది కూడా చంద్రబాబుకు అవసరం లేని విషయమే.

సవాల్ చేస్తున్నారా…?

మరో వైపు చంద్రబాబు వారసుడు, లోకేష్ కూడా జగన్ ని సవాల్ చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చిన విచారణ జరిపించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ భయపడరు అంటూ ట్వీట్లు పెడుతున్నారు. చంద్రబాబు మీద జరిగినన్ని విచారణలు ఎవరి మీద జరగలేదని కూడా అంటున్నారు. అయినా సరే తమ నాయకుడు మేలిమి ముత్యంలా మెరిసిపోతున్నారని, ఇవన్నీ తప్పుడు విచారణలు అంటూ లోకేష్ కొట్టేస్తున్నారు. ఓ విధంగా జగన్ నే కాదు, వైఎస్సార్ ని సైతం నిందిస్తూ లోకేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కడిగిన ముత్యంలా….

నిజానికి వర్తమాన రాజకీయాల్లో ఎవరూ కడిగిన ముత్యాలు కాదన్నది సగటు జనం మాట. మరి చంద్రబాబు తాను నిప్పునని చెప్పినా జనమైతే నమ్మేది లేదు. అదే సమయంలో ఆయన మీద ఏ విచారణ జరగదు, ఒకవేళ జరిగినా అది స్టే దశను దాటి వెళ్ళదు అన్నది కూడా చంద్రబాబు గురించి తెలిసిన ప్రజల నమ్మకం. అందువల్ల ఈ సవాళ్ళూ అన్నీ ఆ ధైర్యంతో చేసినవేనని కూడా గట్టిగా భావిస్తున్నారు. వైఎస్సార్ అయినా, జగన్ అయినా చంద్రబాబును ఎలాగైనా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తారని, కానీ బాబు ఎవరికీ అందని రాజకీయ గండరగండడు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకు ఉన్న ధైర్యం ఏంటో జనాలకు తెలుసు. తాను నిప్పు, అగ్గి అని ఆయన బయటకు చెప్పుకున్నా చంద్రబాబు తెలివినీ, రాజకీయాన్నే జనం ఎక్కువగా నమ్ముతున్నారు. దాని మీద పోరాడి జగన్ కనుక గెలిస్తే మాత్రం అది అధ్బుతమేనని ఇదే జనం అంటారేమో.

Tags:    

Similar News