బాబు గేమ్ స్టార్ట్ చేశారా?

చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేసినట్లే కనపడుతోంది. బీజేపీ దూకుడుకు కొంత చెక్ పెట్టాలనే నిర్ణయించుకుంది. అందుకే ఆ ముగ్గురు ఈ మధ్యకాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా [more]

Update: 2020-02-20 13:30 GMT

చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేసినట్లే కనపడుతోంది. బీజేపీ దూకుడుకు కొంత చెక్ పెట్టాలనే నిర్ణయించుకుంది. అందుకే ఆ ముగ్గురు ఈ మధ్యకాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి చంద్రబాబు కారణమా? అవుననే అంటోంది బీజేపీలోని ఒక వర్గం. ఈ ముగ్గురు కలసి కట్టుగా ఎందుకు కమలానికి దూరంగా ఉంటున్నారు? అన్నదే చర్చనీయాంశమైంది.

ముగ్గురినీ కట్టడి చేసి…..

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో టీడీపీని టోకుగా విలీనం కూడా చేశారు. అయితే చంద్రబాబు అంగీకారంతోనే వీరు బీజేపీలోకి వెళ్లినట్లు ప్రచారం అయితే ఉంది. తోట త్రిమూర్తులు లాంటి వాళ్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే రకమైన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం, బీజేపీని ఎన్నికలకు ముందు దూరం చేసుకోవడంతో కావాలనే దగ్గరుండి వారిని పంపినట్లు చెబుతారు. అయితే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా వీరు పార్టీని వీడటం విశేషం.

ఐటీ దాడులే కాకుండా….

కానీ గత కొద్ది రోజులుగా చంద్రబాబుకు బీజేపీలో జరిగే పరిణామాలు మింగుడుపడటం లేదు. ఆదాయపు పన్ను శాఖ దాడులు ఊపిరి సలపనివ్వడం లేదు. ఒకవైపు జగన్ రాష్ట్రంలో టీడీపీ నేతలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంటే, కేంద్రం నుంచి కూడా అదే తరహా విధానం మొదలయినట్లు చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా తాను బీజేపీతో మళ్లీ చేతులు కలపాలని ప్రయత్నించినా అటు నుంచి నో అన్న సమాధానం వచ్చింది. దీనికి తోడు బీజేపీకి జగన్ చేరువవుతున్నట్లు పరిస్థితులు కనపడుతున్నాయి.

తనవైపు మళ్లించుకోవాలంటే…?

అందుకే తమ పార్టీ నుంచి వెళ్లిన ముగ్గురు ఎంపీలను కట్టడి చేసి బీజేపీ దూకుడును కొంత తగ్గించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. ఐటీ దాడులు మాత్రమే కాకుండా అమరావతి రాజధాని తరలింపు, శాసనమండలి రద్దు విషయంలో బీజేపీ తమకు సహకరించకపోవడం, కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ముగ్గురి చేత కొంత కథనడిపించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ లో ముగ్గురు సభ్యులు అసంతృప్తిగా ఉంటే ప్రభుత్వం కొంతలో కొంత దిగివస్తుందని భావిస్తున్నారు. అయితే పైకి మాత్రం జీవీఎల్ నరసింహారావు మీద ఆగ్రహంతోనే వీరు పార్టీ మీటింగ్ కు రాలేదని చెబుతున్నా, వీరి ఆబ్సెంట్ వెనక బాబే ఉన్నారన్నది అసలైన నిజం అంటున్నారు.

Tags:    

Similar News