పొడిచేస్తామంటున్నారే?

ఏపీలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైసీపీ ఊడ్చేసింది. అంతవరకూ అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 సీట్లతో ఓ మూలన విసిరేసినట్లుగా అయిపోయింది. [more]

Update: 2020-02-25 05:00 GMT

ఏపీలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైసీపీ ఊడ్చేసింది. అంతవరకూ అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 సీట్లతో ఓ మూలన విసిరేసినట్లుగా అయిపోయింది. ఇక జనసేనాని గొప్పలకు జనం ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. జాతీయ పార్టీలం, మేమే అందరికీ పెద్దలం అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు కూడా జనం చుక్కలు చూపించారు. ఇపుడు కొత్త ఏడాది వచ్చేసింది. భారీ ఓటమి నుంచి ఈ పార్టీలన్నీ మెల్లగా తేరుకుని కొత్త ఆశలను నింపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రేపటి రోజు తమదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వీటి ఆశ, శ్వాస ఇపుడు స్థానిక ఎన్నికల మీదనే ఉంది. దాంతో ఇక్కడే గెలిచేస్తామని, పొడిచేస్తామని గట్టిగానే ప్రకటించుకుంటున్నాయి.

అన్నీ గెలవాలట….

ఏడాది క్రితం వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశానికి ఇపుడు జీవన్మరణంగా రాజకీయం ఉంది. ఓ వైపు వయసు అయిపోతున్న పార్టీ, మరో వైపు జగన్ దూకుడుతో ఎటూ పోవాలో దిక్కుతోచడంలేదు. దాంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తే కొంతలో కొంత బెటర్ అనుకుంటోంది ఆ పార్టీ. దాని కోసం చంద్రబాబు పదమూడు జిల్లాల టూర్ స్టార్ట్ చేసారు. లోకల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీద జరుగుతాయి కాబట్టి గెలుపు మనదేనని చంద్రబాబు నూరిపోస్తున్నారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇచ్చేశారు. ఇక వచ్చే చాన్సులన్నీ మనవేనని కూడా చంద్రబాబు కొత్త విశ్లేషణ వినిపిస్తున్నారు. ఓ విధంగా లోకల్ ఎన్నికల్లో అధ్బుతాలు జరిగిపోతాయని చంద్రబాబుకు చాలా నమ్మకం ఉన్నట్లుంది.

ఇక్కడ నుంచేనట…..

మరో వైపు పవన్ కళ్యాణ్ సైతం లోకల్ ఎన్నికల మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ చేసిన తప్పులే మనకు కొండంత అండ అంటున్నారు. ప్రజల్లో ఉండేవారికే టికెట్లు ఇస్తామని, వారే రేపటి మన ప్రతినిధులు, గెలుపు బావుటాలు అంటున్నారు. పవన్ ఓ వైపు సినిమాలు చేసుకుంటున్నా వీకెండ్ టూర్లు పెట్టుకోవడానికి ఇప్పటికిపుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉండడమే. ఆయన సైతం అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రతిపక్ష టీడీపీ బాగా బలం తగ్గిపోయిందని. అందువల్ల జనసేనకే జనం పట్టం కడతారని చెబుతున్నారు. మరి ఇది నమ్మకమో, అతి ధీమావో తెలియదు కానీ పవన్ మళ్ళీ ఉత్సాహం తెచ్చుకోవడానికి లోకల్ ఎన్నికలే కారణం అంటున్నారు.

మొత్తం రెడీఅట…

ఇక పీసీసీ కొత్త కామందు శైలజానాధ్ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో మిగిలిన కార్యకర్తలను తట్టి లేపుతున్నారు. కాంగ్రెస్ బలం ఎక్కడికీ పోలేదుట. జనం తమ పార్టీని నమ్ముతారట. జనంలోకి వెళ్ళి గెలుచుకురండి అని పిలుపు ఇస్తున్నారు. వైసీపీ తో జనం విసిగిపోయారు కాబట్టి అసలైన ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమేనని కూడా ఆయన‌ నిబ్బరంగా చెబుతున్నారు. మొత్తానికి మొత్తం పదమూడు జిల్లాలలో కాంగ్రెస్ అభ్యర్ధులను నిలబెడతామని కూడా ఆయన భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

బీజేపీ సరేసరి…..

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సరేసరి. ఆ పార్టీకి ఏపీలో పెద్దగా బేస్ లేకపోయినా లోకల్ ఎన్నికల్లో గెలిచేస్తాం అంటోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తామని చెబుతోంది. తమ పార్టీకి ఆదరణ ఉందని, కార్యకర్తల బలం కూడా ఉందని, ఈసారి జనం తప్పకుండా మంచి తీర్పు ఇస్తారని ఆశపడుతోంది. మరో వైపు వామపక్షాలు టీడీపీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలనుకుంటున్నాయట. మొత్తానికి అసలు ఎన్నికల్లో చిత్తు అయినా ఏడాది తిరగకుండానే విపక్ష శిబిరంలో కొత్త ఆశలు పెరగడానికి కొసరు ఎన్నికలు కారణమవుతున్నాయి. చూడాలి మరి అంత ఛాన్స్ జనం ఇస్తారా..?

Tags:    

Similar News