రియాక్షన్ లేదెందుకో?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఆయన ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకపోవడం గతంలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. [more]

Update: 2020-02-15 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఆయన ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకపోవడం గతంలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం, ఆ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించామని ఆ శాఖ ప్రకటించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది.

ఐటీ దాడుల విషయంలో…..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్ కు చెందిన బినామీ కంపెనీల్లోనే ఈ దాడులు జరిగాయని వైసీపీ నేతలు గట్టిగా విమర్శిస్తన్నారు. నిన్న ఒక్కరోజే 24 మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు పని అయిపోయినట్లేనని చెప్పారు. ఆయన త్వరలో జైలుకు వెళతారని కూడా జోస్యం చెప్పారు. అంతేకాదు చంద్రబాబు అక్రమంగా మూడు లక్షల కోట్లు సంపాదించారని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.

గట్టిగానే ఇచ్చినా…..

దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురైదుగురు నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఏమీ లేదని, దేశ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో కేవలం 85 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, మాజీ పీఎస్ కు చంద్రబాబుకు సంబంధమేంటని యనమల రామకృష్ణుడు లాంటి వాళ్లు ప్రశ్నించారు. అయినా చంద్రబాబు స్పందన లేకపోవడం పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

బస్సు యాత్ర నేపథ్యంలో…..

ఈ నెల 17వ తేదీ నుంచి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే ఐటీ దాడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చిన్నాచితకా అంశాలపై కనీసం ట్విట్టర్ లోనైనా రియాక్ట్ అయ్యే చంద్రబాబు తనపై ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నా స్పందించకపోవడంపై పార్టీలోనే చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఐటీ దాడుల విషయంపైనే న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో?నన్న ఆసక్తి రాజకీయంగా నెలకొంది.

Tags:    

Similar News