బిగించేస్తున్నారుగా

బీజేపీకి ఢిల్లీ దెబ్బ అలా ఇలా తగలలేదు. రాగల ప్రమాదాన్ని పక్కలోకి తెచ్చేసింది. హస్తినలో ఆప్ విజయంతో బీజేపీకి గుండె దడ పట్టుకుంది. కాంగ్రెస్ కోలుకోలేదు కాబట్టి [more]

Update: 2020-02-15 08:00 GMT

బీజేపీకి ఢిల్లీ దెబ్బ అలా ఇలా తగలలేదు. రాగల ప్రమాదాన్ని పక్కలోకి తెచ్చేసింది. హస్తినలో ఆప్ విజయంతో బీజేపీకి గుండె దడ పట్టుకుంది. కాంగ్రెస్ కోలుకోలేదు కాబట్టి మేమే జాతీయస్థాయిలో చాంపియన్స్ అని విర్రవీగుతున్న బీజేపీకి ఇపుడు ప్రాంతీయ పార్టీలే గట్టి సవాల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక్క లెక్కన కలిస్తే మాత్రం ఢిల్లీకి దగ్గర దారి దొరికినట్లే. మరి దీన్ని బీజేపీ ముందుగానే ఊహించే నాలుగేళ్ళ పాటు చేతిలో అధికారం ఉండగానే కట్టడి చేసే చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే ఏపీలో వైసీపీ అధినేత జగన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ ని ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి తేవాలనుకుంటున్నారు.

బాబే అసలు ముప్పు…

చంద్రబాబు ఇపుడు మోడీ, అమిత్ షాలకు పెద్ద ముప్పుగా కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాళ్ళకు బలపం కట్టుకుని బీజేపీ వ్యతిరేక పార్టీల చుట్టూ తిరిగి పరిస్థితిని ఒక కొలిక్కి తెచ్చిన చంద్రబాబును ఇపుడు బీజేపీ బాగానే గుర్తు చేసుకుంటోంది. దేశంలో అన్ని పార్టీలను కలపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఎటువంటి భేషాజాలు లేకుండా ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం చేయాలంటే బాబు తప్ప ఎవరూ ఆ పని చేయలేరు. పైగా లౌక్యం, సహనం, ఓర్పు ఇవన్నీ చంద్రబాబులో ఉన్నాయి. ఆయన ఎలాగోలా భిన్న ధ్రువాలను ఒక వైపునకు చేర్చగల సమర్ధుడు.

గండమేగా..?

ఇక 2019 ఎన్నికల్లో అయితే బీజేపీకి ఆదరణ ఉంది కాబట్టి చంద్రబాబు పాచికలు పారలేదు, 2024లో అయితే తప్పకుండా జనం కూడా ప్రాంతీయ పార్టీల కూటమి వైపు చూసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అప్పటికి పదేళ్ళ పాటు అధికారంలో బీజేపీ ఉంటుంది. కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మోడీ చరిష్మా కూడా బాగా కరిగిపోతోంది. దాంతో విపక్ష కూటమి కనుక గట్టి హామీతో ముందుకు వస్తే బీజేపీకి పెను సవాల్ ఎదురవడం ఖాయం. ఈ ప్రమాదాన్ని ముందే ఊహిస్తున్న బీజేపీ పెద్దలు విపక్ష కూటమికి సూత్రధారి అవుతారని భావిస్తున్న చంద్రబాబుని పూర్తిగా తొక్కేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఇప్పటి ఢిల్లీ వాతావరణం చూస్తే క‌నిపిస్తోంది.

గడ్డు రోజులే….?

ఢిల్లీ ఫలితాలు, బీజేపీకి చావు దెబ్బ మాటేమో కానీ చంద్రబాబుకు గడ్డు రోజులు ముందు వున్నాయని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ సమర్ధతే ఇపుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందని కూడా అంటున్నారు. చంద్రబాబు దేశంలో ఎన్నో ఫ్రంటులను నేను కట్టాను, రాష్ట్రపతులను, ప్రధానులను నేనే చేశాను అని తరచుగా గొప్పలు చెప్పుకుంటారు. అదే ఇపుడు చంద్రబాబుకు శాపమంగా మారనుందని అంటున్నారు. చంద్రబాబుని కనుక ఇలా వదిలేస్తే ఆయన మరోసారి విపక్ష కూటమి కట్టి ఢిల్లీ పీఠానికి ఎసరు పెడతారని మోడీ, షా ద్వయం ఆందోళన పడుతోందని అంటున్నారు. అందుకే నాలుగేళ్ళ అధికారం చేతిలో ఉండగానే చంద్రబాబుని ముప్పతిప్పలు పెట్టడానికి బీజేపీ రెడీ అవుతోందని అంటున్నారు.

జగన్ ద్వారానే…?

బీజేపీ కేంద్రంలో ఇపుడు బలంగా ఉంది. తలచుకుంటే ఏమైనా చేయగలదు, ఇక చంద్రబాబు కూడా నిప్పు అని ఎంతగా చెప్పుకున్నా ఆయన మీద గతంలో కేసులపై స్టేలు ఉన్నాయి. ఇపుడు అమరావతి, పోలవరం విషయంలో అవినీతి జరిగిందని బీజేపీ పెద్దలే అంటున్నారు. దానికి తోడు జగన్ కూడా చంద్రబాబుని గట్టిగా బిగించాలనుకుంటున్నారు. అందువల్ల తమ చేతికి మట్టి అంటకుండా అంతా జగన్ చేయిస్తున్నట్లుగానే కలరింగ్ ఇచ్చి చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించడానికి బీజేపీ తయారుగా ఉందని అంటున్నారు. తాజాగా మోడీ, అమిత్ షాలను జగన్ కలసిన సందర్భాల్లో చంద్రబాబు కేసుల ప్రస్తావన కూడా ప్రముఖంగా వచ్చిందని ఢిల్లీ వార్తల భోగట్టా. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం జగన్ కంటే కూడా బీజేపీకి ఇపుడు చాలా అవసరం. ఇన్నాళ్ళూ కేంద్రం సీరియస్ గా ఉండకపోవడం వల్లనే చంద్రబాబు బాగానే నెట్టుకువచ్చారు. ఇపుడు కేంద్రంలోని బలమైన పెద్దలే చంద్రబాబు విషయంలో ఏదో చేయాలన్న కసి మీద ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వల్లభుడికి కష్టకాలమేనని అంటున్నారు.

Tags:    

Similar News