బౌన్స్ బ్యాక్ అవుతారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైకిల్ కు రిపేర్ చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. ఈ నెల 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. [more]

Update: 2020-02-11 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైకిల్ కు రిపేర్ చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. ఈ నెల 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని తరలింపు వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. వారి నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుండటం విశేషం.

ఓటమి తర్వాత….

పార్టీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత వివిధ జిల్లాలను సమీక్షలు చేశారు. దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఆయన సమీక్షలు జరిపి పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తర్వాత రాజధాని అమరావతి అంశం తెరమీదకు రావడంతో జిల్లా సమీక్షలకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. రాజధాని కోసం జిల్లాలను పర్యటించాల్సి రావడంతో ఆయన సమీక్షలను వాయిదా వేసుకున్నారు.

మహానాడు నాటికి…..

మరోవైపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంది. మహానాడు సమయానికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీలో పూర్తిగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అలాగే వెనుకబడినవర్గాల వారికి కూడా పార్టీ పదవుల్లో సింహభాగం ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడిని మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. కళా వెంకట్రావు స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో…..

ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కూడా చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 23 మంది ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో నేతల్లో భరోసా నింపే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే కొంతవరకూ జగన్ ను కట్టడి చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగానే నేతలకు చంద్రబాబు క్లాస్ పీకనున్నారు.

Tags:    

Similar News